ఆటో డ్రైవర్‌కు కనిపించిన దేవుడు, జేసీబీతో తవ్వగా కనిపించిన లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి.
కలలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. గాఢ నిద్రలో కలలు కంటాం. వాటికి మన జీవితంతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. నిద్రలో మనకు వచ్చే కలల వెనుక ఏదో అర్థం దాగి ఉంటుంది. శ్రీమహావిష్ణువును ప్రపంచ పరిరక్షకుడు అంటారు. ఆయన కలలోకి రావడం మీ ప్రస్తుత పనిలో మీరు విజయం సాధిస్తారనే సందేశాన్ని ఇస్తుంది. అయితే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామ సమీపంలో దేవుడు వెలిశాడంటూ గ్రామస్తులు తవ్వకాలు జరిపి ఓ రాయిని వెలికితీసి పూజలు చేశారు.
గ్రామానికి చెందిన బుద్ధారపు శ్రీనివాస్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఒక రోజు రాత్రి వేళ తన పని ముగించుకుని తిరిగి గ్రామానికి వస్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న పొదలో దేవుడు కనిపించినట్లు అనిపించడంతో గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు నమ్మకపోవడంతో తానే స్వయంగా కొంతమంది గ్రామస్తులతో ముక్కోటి ఏకాదశి రోజున కొంత మేర తవ్వకాలు చేపట్టి వదిలివేశారు.
ఆనాటి నుంచి గ్రామంలో జరిగే కొన్ని శుభకార్యాలలో మహిళలకి ఉగ్రరూపంలో ఒంటిపైకి వచ్చి నేను అక్కడే ఉన్నానంటూ నన్ను ఎవరు గుర్తించడం లేదని చెబుతుండటంతో గ్రామస్తులంతా చర్చించుకుని తవ్వకాలు జరిపేందుకు ముహూర్తం ఖరారు చేశారు. గ్రామస్తుడు శ్రీనివాస్‌కు దేవుని రూపంలో కనిపించిన ఆ ప్రదేశంలో గ్రామస్తులు పూజారితో పూజలు నిర్వహించి జేసీబీతో తవ్వకాలు జరిపారు.
12 అడుగుల మేర తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఓ బండరాతికి మీసాల లక్ష్మీ నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి రూపాలు కనిపించాయి. దీంతో పూజారులు వాటికి పూజలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకొని స్వామి వెలిశాడనే నమ్మకంతో పూజలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతం అంతా పండగ వాతావరణం నెలకొంది.