మాజీ ప్రియుడిపై చేతబడి చేయించిన యువతి, చివరికి ఏం జరిగిందో తెలుసా..?
గిట్టని వారిని చంపటానికో, హానిచేయడానికో చేసే/చేయించే విద్యని చేతబడి అంటారు.వివిధ ప్రాంతాలను బట్టి దీనిని విచ్ క్రాఫ్ట్, వూడూ, బ్లాక్ మ్యాజిక్, సిహ్ర్, బాణామతి, చిల్లంగి అని కూడా అంటారు. ఇది పగ తీర్చుకోటానికి ప్రయోగించే మరో దుర్మార్గం. దీని ప్రభావం వల్లనే నష్టం జరిగిందని భావించి పగలు తీర్చుకొంటున్నారు. అయితే బెంగళూరులోని జలహళ్లిలో నివసిస్తున్న 25 ఏళ్ల యువతి ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ తనను తిరిగి ప్రేమించాలని ఆమె ఆశించింది. బ్రేకప్ అనంతరం కూడా అతన్ని వదిలి ఉండలేకపోయింది.
అతడిని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో, చివరికి చేతబడి చేయించాలని నిర్ణయించుకుంది. కానీ లవర్ తిరిగి లవ్ చేయకపోగా, ఆమె రూ.8.2 లక్షలు మోసపోయింది. విడిపోయిన బాధలో ఉన్న సమయంలో ఆమె ఆన్‌లైన్‌లో సహాయం కోసం చూసింది. ఆ క్రమంలో ఆస్ట్రాలజర్‌గా చెప్పుకునే అహ్మద్, అతని ఇద్దరు సహాయకులు అబ్దుల్, లియాఖతుల్లా పరిచయమయ్యారు. చేతబడి ద్వారా బాయ్‌ఫ్రెండ్‌ను తిరిగి కలపగలమని వారు బాధితురాలిని నమ్మించారు.
డిసెంబర్ 9న అహ్మద్ బాధితురాలికి ఫోన్ చేసి ఆమెపై, ఆమె స్నేహితులపై, కుటుంబ సభ్యులపై ఎవరో చేతబడి చేశారని చెప్పాడు. అందుకే ఆమె జీవితంలో ఇబ్బందులు కలుగుతున్నాయని నమ్మబలికాడు. రూ.501 చెల్లిస్తే ఒక కర్మ చేసి ఈ చేతబడి ప్రభావాలను తొలగించగలనని తెలిపాడు. అది నిజమేనని నమ్మిన యువతి, అహ్మద్‌కు ఆన్‌లైన్‌లో డబ్బు పంపింది. కొంత సమయం తర్వాత సొంత ఫొటోలతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యుల ఫొటోలను ఇవ్వాలని అహ్మద్ బాధితురాలని అడిగాడు.
ఎక్స్ బాయ్‌ఫ్రెండ్, అతడి పేరెంట్స్ ఫొటోలు కూడా అడిగాడు. ఆ ఫొటోలతో బ్లాక్ మ్యాజిక్ చేసి మాజీ ప్రియుడి చేత తిరిగి ప్రేమించేలా చేస్తానని, అతడి తల్లిదండ్రులు ఈ ప్రేమ పెళ్లికి ఒప్పుకునేలా కూడా చేస్తానని బాధితురాలిలో ఆశ కలిగించాడు. ఇలా చేయడానికి రూ.2.4 లక్షలు కావాలని అహ్మద్ అమాయకంగా అడిగాడు. బాధితురాలు డిసెంబర్ 22న అయిష్టంగానే డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసింది. అయితే అక్కడితో అహ్మద్ డబ్బు అడగడం మానలేదు. కొద్ది రోజుల తర్వాత రూ.1.7 లక్షలు ఎక్కువ కావాలని డిమాండ్ చేశాడు.
ప్రియుని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అహ్మద్ మోసం చేస్తున్నాడని బాధితురాలు గ్రహించింది. మరోసారి డబ్బు చెల్లించడానికి నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడైన అహ్మద్.. ఆమెతో పాటు మాజీ ప్రియుడితో ఉన్న కొన్ని ప్రైవేట్ ఫొటోలను తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించాడు. బాధితురాలు భయపడిపోయి జనవరి 10న రూ.4.1 లక్షలు పంపించింది.