Health

మన దేశంలో క్యాన్సర్‌కు ఉచితంగా వైద్యం చేస్తే ఆసుపత్రుల పూర్తి వివరాలు ఇవే.

క్యాన్సర్ని తెలుగులో “కర్క రోగం” అని అంటారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఈ కణసమూహాలను ‘కంతి’ అంటారు. సాధారణంగా క్యాన్సర్‌కు చికిత్స డబ్బుతో కూడుకున్న విషయం. ఈ భయంకరమైన వ్యాధితో పోరాటం బాధిత కుటుంబాలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ప్రభుత్వాలు తక్కువ ఖర్చుతో, ఉచితంగా క్యాన్సర్ చికిత్సలు అందించే ఆసుపత్రులను ప్రారంభిస్తున్నాయి. క్యాన్సర్ పేషెంట్లు, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా స్వాంతన కల్పించేలా వీటికి రూపకల్పన చేస్తున్నారు.

టాటా మెమోరియల్ హాస్పిటల్, ముంబై
ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ (Tata Memorial Hospital) భారతదేశంలోని అత్యుత్తమ, అత్యంత అధునాతన క్యాన్సర్ ట్రీట్‌మెంట్ సెంటర్స్ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక్కడికి వచ్చే క్యాన్సర్ రోగుల్లో దాదాపు 70% మందికి ఉచితంగా ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. క్యాన్సర్ పరిశోధనలో కూడా ఈ సంస్థ ముందంజలో ఉంది. టాటా మెమోరియల్.. అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC)గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రోగులకు కీమోథెరపీ, రేడియాలజీ ట్రీట్‌మెంట్స్‌ అందిస్తూ ఉత్తమ ఫలితాలను నమోదు చేస్తున్నారు వైద్యులు. అల్ట్రాసౌండ్‌లు, CT స్కాన్‌లు, MRIలు అలాగే రియల్ టైమ్ న్యూక్లియర్ మెడిసిన్ స్కానింగ్, PET స్కాన్‌లను నిర్వహించడానికి అధునాతన పరికరాలు ఉన్నాయి. దీంతోపాటు శిక్షణ పొందిన సిబ్బంది ఈ ఆసుపత్రి సొంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపు 8500 ఆపరేషన్లు జరుగుతాయి. ప్రతి సంవత్సరం 5000 మంది రోగులు రేడియోథెరపీ, కీమోథెరపీ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.

కిద్వాయ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, బెంగళూరు
అత్యాధునిక యంత్రాలు, మౌలిక సదుపాయాలతో కూడిన కిద్వాయ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (Kidwai Memorial Institute of Oncology).. దేశంలో క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్న అత్యంత ప్రసిద్ధి చెందిన ఇన్‌స్టిట్యూట్‌లలో ఒకటి. దీనికి భారత ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఇక్కడ ఉచితంగా చికిత్స అందిస్తారు. మార్కెట్ ధరలతో పోలిస్తే, కిద్వాయ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్‌లో విక్రయించే క్యాన్సర్ మందులు కనీసం 40 నుంచి 60 శాతం తక్కువ ధరకే లభిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు క్యాన్సర్ చికిత్సల కోసం నిధులు అందించడానికి, పథకాలను అమలు చేయడానికి ఈ సంస్థతో కలిసి పనిచేస్తోంది. క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స కోసం కాంప్లెక్స్ ఎనలిటికల్ టెస్టులు చేసే హార్డ్‌వేర్, మెకానికల్ అసెంబ్లీ సెటప్ ఈ సంస్థ సొంతం.

టాటా మెమోరియల్ హాస్పిటల్, కోల్‌కతా
కోల్‌కతాలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ (Tata Memorial Hospital) క్యాన్సర్ చికిత్స, మందుల ధరలను అతి తక్కువ ధరలోనే అందిస్తోంది. ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న వెనుకబడిన వర్గాల వారిని ఆదుకుంటోంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న నిరుపేద ప్రజలకు ఉచితంగా చికిత్స అందిస్తుంది. అలాగే ఇతరులకు సబ్సిడీ ధరలపై ట్రీట్‌మెంట్, మందులను అందిస్తుంది.

రీజినల్ క్యాన్సర్ సెంటర్, తిరువనంతపురం
కేరళలోని రీజినల్ క్యాన్సర్ సెంటర్ (Regional Cancer Center- RCC) క్లినికల్ రీసెర్చ్‌కు ప్రసిద్ది చెందింది. ఆర్థిక స్తోమత సరిగా లేని క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తుంది. ఇక్కడ క్యాన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు, పేద ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండా మోడ్రన్ ఆంకాలజీ సేవలను అందుబాటులో ఉన్నాయి. ఐసోటోప్, CT స్కానింగ్, కీమోథెరపీ వంటి సేవలన్నీ ఉచితంగా అందిస్తారు. రీజినల్ క్యాన్సర్ సెంటర్ రోగులలో 60% మందికి ఉచితంగా క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు. అయితే మధ్యతరగతి వర్గానికి చెందిన 29% మంది రోగులకు సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయి. నయం చేయగల క్యాన్సర్ ఉన్న పెద్దలు, పిల్లలు ఆదాయ వర్గంతో సంబంధం లేకుండా ఉచిత చికిత్స సేవలను ఉపయోగించుకోవచ్చు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తుల కోసం నిధులను సేకరించేందుకు RCC ‘క్యాన్సర్ కేర్ ఫర్ లైఫ్’ (CCL) పథకాన్ని సంస్థ ఏర్పాటు చేసింది. గత 5 సంవత్సరాలలో ఇక్కడ రూ. 80 లక్షల మార్కెట్ విలువ కలిగిన మందులను పేదలకు ఉచితంగా అందించినట్లు అంచనా. ఇక్కడ ఏటా 11,000 కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులకు చికిత్స అందిస్తున్నారు. ఇది దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న క్యాన్సర్ ఆసుపత్రులలో ఒకటిగా నిలుస్తోంది. మోడ్రన్ మెడికల్ ఎక్విప్‌మెంట్‌తో పాటు అత్యుత్తమ క్యాన్సర్ కేర్ ట్రీట్‌మెంట్ అందించే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి.

క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ముంబై
క్యాన్సర్ లేదా క్యాన్సర్ చికిత్సల దుష్ప్రభావాలను (Side Effects) ఎదుర్కోవడానికి ఆల్టర్నేటివ్, కాంప్లిమెంటరీ థెరపీ అవసరమైన వారికి ముంబైలోని CCFI (Cancer Care Foundation of India) ఉచితంగా చికిత్సలు అందిస్తుంది. ఇక్కడ ఆయుర్వేదం, యోగా, గోమూత్ర చికిత్స సూత్రాలను అవలంభిస్తారు. క్యాన్సర్ రోగులకు ఆహారం, పోషకాహారానికి సంబంధించిన సలహాలు అందిస్తారు. ఈ చికిత్సలు అల్లోపతి ట్రీట్‌మెంట్ ప్రభావాలను ఎదుర్కోవడంలో చాలా మందికి సహాయపడ్డాయి. క్యాన్సర్ మెడిసిన్స్‌ను బాధితుల శరీరం బాగా గ్రహించడానికి ఈ విధానాలు తోడ్పడతాయి. CCFIకి నాసిక్, బెంగళూరులలో కూడా కేంద్రాలు ఉన్నాయి.

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ
న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS, Delhi) క్యాన్సర్ బాధితులకు ఉచితంగా చికిత్స అందిస్తోంది. ‘డా. B.R.A ఇన్స్టిట్యూట్ – రోటరీ క్యాన్సర్ హాస్పిటల్’ స్పెషాలిటీ సెంటర్ పేరుతో ఈ సంస్థ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ అందిస్తోంది. లీనియర్ యాక్సిలరేటర్, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ, బ్రాచిథెరపీ మెషీన్‌లతో పాటు అత్యుత్తమ రేడియోథెరపీ, రేడియో డయాగ్నస్టిక్ మెషీన్‌లు ఈ సంస్థ సొంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం 3,000 సర్జరీలు జరుగుతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker