Health

ముఖానికి రేజర్ వాడుతున్నారా..? ఈ తిప్పలు తప్పవు.

కొందరికి ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా వస్తాయి. వీటిని ముఖ వెంట్రుకలు అంటారు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వెల్లస్ హెయిర్, రెండోది టెర్మినల్ హెయిర్. వెల్లస్ హెయిర్ అంతగా కనిపించదు, చాలా చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఇక టెర్మినల్ హెయిర్ ముదురుగా, మందంగా పెరుగుతుంది. ఇవి ఎక్కువగా పై పెదవులు, గడ్డం చుట్టూ వస్తాయి. అయితే ముఖం మీద ఉండే అవాంఛిత రోమాలను తీసేయడానికి ఫేషియల్ రేజర్లను వాడతారు. దానివల్ల చర్మానికి కలిగే నష్టాలేంటో చూడండి.

ముఖం మీద వచ్చే అవాంఛిత రోమాలను తొలగించడానికి చాలా మంది అమ్మాయిలు సులువుగా ఉంటుందని రేజర్లను వాడతారు. కానీ వాటి వల్ల నష్టాలెక్కువ అంటున్నారు చర్మ సౌందర్య నిపుణులు.అబ్బాయిల కన్నా అమ్మాయిల చర్మం సున్నితంగా ఉండటమే దానికి కారణం. వెంట్రుకల పెరుగుదల తగ్గించడానికి వ్యాక్సింగ్, థ్రెడింగ్, లేజర్ ట్రీట్‌మెంట్లు ఇలా చాలా ఉంటాయి. కానీ ఆ చికిత్సల గురించి అపోహలతో అలాగే ఇదే సులువుగా ఉంటుందని రేజర్ వాడతారు చాలామంది మహిళలు.

ఎందుకంటే సెలూన్ కి వెళ్లడమో, వైద్యుల్ని కలవడమో, నిజానికి బయటకి వెళ్లాల్సిన అవసరమే లేదు కాబట్టి చాలా మందికి అసౌకర్యంగా ఉన్నా కూడా ఈ పద్ధతే నచ్చుతుంది. కానీ దానివల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోవడమే అన్నింటికన్నా ముఖ్య కారణం. ఇవి తెలుసుకోండి..రేజర్లను వాడటం వల్ల చర్మంపై దద్దుర్లు, చర్మం ఎర్రబారటం, ఇన్ గ్రోన్ హెయిర్ సమస్య వస్తుంది. ముఖ్యంగా సున్నిత చర్మతత్వం ఉన్నవాళ్లకి ఇది అస్సలు మంచిది కాదు.

ఎగ్జీమా, దురద సమస్యల్ని పెంచుతుంది కూడా. ఇన్ గ్రోన్ హెయిర్.. ఇన్ గ్రోన్ హెయిర్ వచ్చే ప్రమాదమే చాలా ఉంది. బ్లేడ్ ఒక కోణంలో వెంట్రుకను కత్తిరిస్తుంది. దానివల్ల తరువాత వెంట్రుక చర్మం బయటికి కాకుండా లోపలికి పెరుగుతుంది. దీంతో నొప్పి, ఎర్రటి మొటిమల్లాంటి దద్దుర్లు వస్తాయి. వీటికి చికిత్స తీసుకోకపోతే ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు. ముఖ్యంగా రేజర్ సరిగ్గా శుభ్రం చేసి వాడకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువ. లేదా ఇతరులు వాడే బ్లేడ్ వాడినా ప్రమాదమే. చీముతో నిండిన దద్దుర్లు, వాపు దానికి సంకేతాలు.

వేరే మార్గాలేంటి.. అవాంఛిత రోమాలు ఎందుకు వస్తున్నాయనే కారణం తెలుసుకోవడం ముందు ముఖ్యం. ఏవైనా ఆరోగ్య సమస్యల వల్లనా, లేదా హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. సమస్యేంటో తెలుసుకున్నాక వెంట్రుకల పెరుగుదల తగ్గడానికి లేజర్ హెయిర్ రిడక్షన్ చికిత్స చేయించుకోవచ్చు. ఇవి వెంట్రుకల మొదళ్ల మీద పనిచేసి జుట్టు పెరగకుండా చేస్తాయి. ఇది అన్నింటికన్నా సురక్షిత మార్గం. చర్మం పాడవ్వదు, చర్మ ఆరోగ్యంలో కూడా మెరుగుదల ఉంటుంది. మృదువుగా మారుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker