వీటిని తింటే చాలు జీవితంలో గుండెల్లో మంట, ఎసిడిటీ, జీర్ణవ్యవస్థ సమస్యలు రావు.
జీర్ణవ్యవస్థ అనగా ఆహారాన్ని జీర్ణం చేసే శరీర భాగం. ఇది ఆహారాన్ని సాధారణ రసాయన పదార్ధాలుగా విచ్ఛిన్నం చేస్తుంది, తద్వారా రసాయన పదార్థాలలోని కొన్ని పోషకాలు రక్త ప్రవాహంలో కలిసిపోతాయి. రక్త ప్రవాహం నుండి పోషకాలు మొదట కాలేయానికి చేరతాయి. కాలేయం పోషకాలను సర్దుబాటు చేస్తుంది, తద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అయితే జీర్ణ సమస్యలు లేని వారు అసలే ఉండరు. జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా ఈ సమస్యల బారిన పడుతుంటారు. గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలన్నీ జీర్ణ సమస్యల వల్లే వస్తాయి. కానీ ఈ జీర్ణ సమస్యలు ఎప్పుడూ వస్తే రోజువారీ జీవితం కూడా ప్రభావితం అవుతుంది. అందుకే జీవనశైలిలో మార్పులు చేయడం చాలా ముఖ్యం.
ఒత్తిడిని తగ్గించడం వల్ల జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆహారం జీర్ణమయ్యే ప్రాంతాలైన పొట్ట, పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన పిండి పదార్ధాలు, అదనపు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు, కృత్రిమ పదార్థాలన్నీ జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వీటన్నింటినీ డైట్ లో చేర్చుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయానికి తినాలి. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని మీరు తినకపోతే ఫుడ్ సరిగ్గా అరగదు. అలాగే మలబద్దకం సమస్య కూడా వస్తుంది.
పేగు వ్యవస్థలో ఆహార స్తబ్దత ఎన్నో రకాల సూక్ష్మక్రిములు, వ్యాధుల పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే నీళ్లను తాగకపోయినా.. శరీర ఆరోగ్యం కూడా ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. జీర్ణక్రియను సులభతరం చేయడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయి. బ్రోకలీ.. బ్రోకలీ మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. బ్రొకోలీలో ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్దకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
పెరుగు.. పెరుగులో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని కాపాడతాయి కూడా. ఇవి ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి, మలబద్దకం సమస్య వచ్చచే అవకాశాన్ని తగ్గిస్తాయి. అల్లం.. అల్లం దగ్గు, జలుబు నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. అల్లంలో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైములు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అల్లంను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
బొప్పాయి.. బొప్పాయిని అందానికి, ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఈ పండులో విటమిన్లు, ఫైబర్ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తింటే జీర్ణక్రియ కూడా సులభం అవుతుంది. పుదీనా ఆకులు.. పుదీనా ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. పుదీనా ఆకులను తింటే మలబద్దకం వచ్చే సమస్యే ఉండదు. నోరు కూడా రీఫ్రెష్ గా ఉంటుంది. పుదీనా ఆకులు జీర్ణక్రియను వేగవంతం చేయడానికి సహాయపడతాయి.