నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా..? మీకు అసలు విషయం తెలిస్తే..?
ఉదయం లేవగానే.. టైం చూసుకోవడంతో మొదలు.. ఈమెయిల్ చెకింగ్స్, వాట్సాప్ మేసేజ్లు చెక్ చేసుకోవడం.. ఇలా ఒక్కటేమిటీ కనీసం అర్థ గంటపాటు ఫోన్లో గడిపేస్తారు. ఇక కొందరికి ఉదయం లేవగానే ఫోన్ చూడకుండా అస్సలు ఉండలేరు. కేవలం యూత్ మాత్రమే కాదండోయ్.. పెద్ద, చిన్నా అనే సంబంధం లేకుండా ఫోన్లో గంటలు గంటలు మునిగిపోతున్నారు.
అయితే ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడిపేస్తూ ఉంటారు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ క్లాసెస్ వంటి అనేక కార్యకలాపాల కోసం మొబైల్ ను ఉపయోగిస్తుంటాం. ఇలాంటి అలవాటు వల్ల ఫోన్ ఎల్ఈడీ ప్రకాశవంతమైన నీలం కాంతి నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీని వల్ల కళ్లకు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం లేవగానే ఫోన్ చూస్తే మానసిక క్షోభ కలుగుతుంది. ఆందోళన, నిద్రలేమి, మెడ నొప్పి, చేతి నొప్పులు వంటి సమస్యలు అధికమవుతాయి.
మొబైల్ ని ఎక్కువగా ఉపయోగించడం ప్రమాదకరమైన అలవాటని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిద్ర లేవగానే మొబైల్ ని చూడడం వల్ల మొబైల్ కు సంబంధించిన లైటింగ్ నేరుగా కళ్లపై పడి పలు రకాల కంటి సమస్యలకు దారి తిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక రాత్రి పడుకున్న తర్వాత ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరిచిన వెంటనే మొబైల్ ని చూస్తే మొబైల్ లైటింగ్ వల్ల కళ్ళు మండుతాయి. క్రమేపి కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఉదయం లేవగానే మొబైల్ ని ఎక్కువగా చూడడం వల్ల మెదడుపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది.
అధిక రక్తపోటు సమస్య ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ లైటింగ్ వలన ఒత్తిడి పెరుగుతుంది, అది తరువాత రక్తపోటు సమస్యకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. పనుల్లో ఏకాగ్రతను కోల్పోవాల్సి వస్తుంది. మొబైళ్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మొదడులో కణాలు పెరిగి ప్రాణాంతకమైన ‘గ్లియోమా’ అనే కణితులు ఏర్పడి, మెదడు క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. సాధ్యమైనంతవరకు మొబైల్ కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.