News

కేంద్రం కొత్త రూల్స్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీసుకెళ్లక్కర్లేదు..!

కొత్త నిబంధనల ప్రకారం మీరు ఇకపై ప్రభుత్వ ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO)లో డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సిన అవసరం లేదు. ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లడానికి బదులుగా మీరు ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్ల వద్ద డ్రైవింగ్ టెస్టుకు హాజరుకావచ్చు. అయితే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఆర్టీఓ కార్యాలయం చుట్టూ తిరగాలి. ముందుగా స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ తదితర అంశాల కోసం ఆర్టీఓ ఆఫీసు చుట్టూ నాలుగైదుసార్లు తిరిగితే గానీ డ్రైవింగ్ లైసెన్స్ అందుకోలేరు. కానీ, ఈ సమస్యలకు చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

జూన్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. దీని ప్రకారం ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణ చేయనక్కర్లేదు. స్లాట్ బుకింగ్.. డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదు. ఎటువంటి టెస్టుల్లేకుండానే తేలిగ్గానే డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇక నుంచి ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. డ్రైవింగ్ లో శిక్షణ పూర్తి చేశాక.. టెస్ట్ చేసి మరీ ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు డ్రైవింగ్ సర్టిఫికెట్ జారీ చేస్తాయి.

ఈ సర్టిఫికెట్ ఆధారంగా డ్రైవింగ్ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంటే తేలిగ్గానే పొందొచ్చు. అన్ని రకాల డ్రైవింగ్ సంస్థలకు కేంద్ర రోడ్డు రవాణా సంస్థ ఈ తరహా అనుమతులు ఇవ్వదు. ఫోర్ వీల్ డ్రైవింగ్ టెస్ట్ సంస్థకు మూడెకరాల భూమి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ టెస్టులు నిర్వహించడానికి అన్ని సౌకర్యాలు ఉండాలి. డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారు కూడా హైస్కూల్ విద్య పూర్తి చేసుకోవడంతోపాటు డ్రైవింగ్‌లో ఐదేండ్ల అనుభవంతోపాటు బయో మెట్రిక్ టెక్నాలజీపై అవగాహన ఉండాలి. లైట్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నాలుగు వారాలు గానీ, కనీసం 29 గంటల శిక్షణ గానీ ఉండాలి.

ఇందులో 21 గంటలు ప్రాక్టికల్, ఎనిమిది గంటలు థియరీ ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆరు వారాలు, 39 గంటల శిక్షణ అవసరం. 31 గంటల పాటు ప్రాక్టికల్, మిగతా ఎనిమిది గంటలు థియరీ ఉంటుంది. ఈ నిబంధనలు పాటించే వారికి మాత్రమే డ్రైవింగ్ టెస్ట్ సర్టిఫికెట్ జారీచేసే అధికారం కల్పిస్తుంది కేంద్ర రోడ్డు రవాణా సంస్థ. ఇలా ప్రైవేట్ డ్రైవింగ్ సంస్థల ద్వారా తీసుకునే డ్రైవింగ్ సర్టిఫికెట్‌తో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలి. అలా చేస్తే ఎటువంటి ఇతర పరీక్షల్లేకుండానే లైసెన్సు మంజూరు అవుతుంది. అయితే ముందుగా ఆర్టీవో ఆఫీసులో ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker