డ్రంక్ అండ్ డ్రైవ్ లో దోకిరిన డ్రైవర్లకు పోలీసులు వింత శిక్ష.
గతవారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతిచెందాడు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని మద్యం సేవించి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపించారు. అయితే, త్రిపుణితుర హిల్ ప్యాలెస్ పోలీసులు తనిఖీల్లో భాగంగా 16 మంది బస్సు డ్రైవర్లను అందుపులోకి తీసుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ మధ్యానికి బాగా అలవాటు పడుతున్నారు.
ఈ అలవాటు కారణంగా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతుంటే మరికొందరు మాత్రం మద్యం మత్తులో ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యం తాగి వాహనం నడపడం నేరమని పోలీసులు, ప్రభుత్వాలు గట్టి హెచ్చరికలు చేస్తున్నాయి. అయినా వారి మాటలను లెక్కచేయకుండా కొందరు మద్యం తాగి వాహనాలను నడుపుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కళాశాలలకు చెందిన కొందరు డ్రైవర్లు ముఖ్యంగా ప్రైవేట్, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఘటనలు,యాక్సిడెంట్ లు జరిగిన ఘటనలు మనం అనేకం చూశాం.
అయితే తాజాగా కేరళ రాష్ట్రంలో మద్యం తాగుతూ పట్టుబడిన డ్రైవర్లు అధికారులు విధించిన శిక్ష ఇప్పుడు సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారింది. వారికి విధించిన శిక్షకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ గా మారింది. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో బస్సు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారంటూ ఇటీవల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో త్రిపున్నితురా హిల్ పాలెస్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వీ.గోపకుమార్ నేతృత్వంలో ఓ బృందం సోమవారం ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల మధ్య రెండు గంటలపాటు నిర్వహించిన తనిఖీల్లో 16మంది బస్సు డ్రైవర్లు మద్యం తాగి బస్సు నడుపుతూ పట్టుబడ్డారు.
పట్టుబడిన వారిలో ఇద్దరు కేఏస్ఆర్టీసీ డ్రైవర్లు,10 ప్రైవేట్ బస్సు డ్రైవర్లు,4 స్కూల్ బస్సు డ్రైవర్లు ఉన్నారు. ఈ డ్రైవర్లు పట్టుబడగానే వారు నడుపుతున్న బస్సుల్లోని ప్రయాణికులను వేరే ఏర్పాట్ల ద్వారా త్రిపున్నితురా బస్ స్టాండ్ లో,స్కూల్ పిల్లలను వారి స్కూళ్లకి సురక్షితంగా చేర్చారు. అనంతరం మద్యం తాగి బస్సు నడుపుతూ పట్టుబడ్డ ఈ 16మంది డ్రైవర్లను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. అక్కడ పోలీసు అధికారులు ఈ 16మంది డ్రైవర్లకి విచిత్ర శిక్ష విధించారు. స్కూల్ పిల్లల మాదిరిగా వీరికి ఇంపోజిషన్ ఇచ్చారు. “ఇప్పటి నుంచి నేను మందు తాగి డ్రైవ్ చేయను”అని 1000సార్లు బుక్ లో రాయాలనే శిక్షను 16 మంది డ్రైవర్లకి విధించారు.
తమకు ఇచ్చిన ఇంపోజిషన్ వర్క్ చేయడం కోసం కొందరు డ్రైవర్లు నేలపై కూర్చొని,కొందరు పడుకొని రకరకాల విన్యాసాలు పడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా,పట్టుబడిన ఆర్టీసీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ఓ రిపోర్ట్ ని సంబంధిత అధికారులకు పంపినట్లు ఇన్స్పెక్టర్ వీ.గోపకుమార్ తెలిపారు. అంతేకాకుండా మద్యం తాగి బస్సు నడుపుతూ పట్టుబడిన డ్రైవర్లు డ్రైవింగ్ లైసెన్స్ ని,వెహికల్స్ పర్మిట్ ను రద్దు చేయాలని సంబంధిత అధికారులను కోరినట్లు చెప్పారు.