యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడితే ఆ సామర్థ్యం తగ్గిపోతుంది.
దేశ వ్యాప్తంగా యాంటీ బయోటిక్స్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది.చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు కూడా యాంటీబయోటిక్స్ ను ఉపయోగిస్తున్న పరిస్థితి ఏర్పడింది. యాంటీబయోటిక్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల వారికి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు అవి ప్రభావంతంగా పనిచేయలేకపోతున్నాయని ఐసిఎంఆర్ సంస్థ గుర్తించింది. అయితే యాంటీబయోటిక్స్ వినియోగం విషయంలో భారత వైద్య పరిశోధన మండలి తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో యాంటీబయాటిక్స్ వాడకం విపరీతంగా పెరిగింది. అయినదానికి, కానిదానికి వాటిని విపరీతంగా వాడేస్తున్నారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యుడిని సంప్రదించకుండానే యాంటీబయాటిక్స్ మింగేస్తున్నారు. అయితే, ఇలా ఇష్టానుసారం వీటిని వాడడం అంత మంచిది కాదని, భారత వైద్య పరిశోధన మండలి హెచ్చరించింది. యథేచ్ఛగా యాంటీబయోటిక్స్ వినియోగంతో.. వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతోందని వెల్లడించింది. దీంతో సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడం సవాల్‌గా మారుతోందని పేర్కొంది.
స్వల్ప జ్వరం అంటే 100.4 నుంచి 102.2 డిగ్రీలలోపు ఉంటే వాటిని వాడొద్దని సూచించింది. దగ్గు, శ్లేష్మం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చలి, కొద్దిపాటి జ్వరం వంటి బ్రాంకైటిస్ లక్షణాలకు కూడా యాంటీబయాటిక్స్ వాడకంలో జాగ్రత్త వహించాలని పేర్కొంది. ఇలాంటి కేసులకు యాంటీబయాటిక్స్ సూచించే విషయంలో వైద్యులు కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని తెలిపింది. ఒకవేళ వాటిని వినియోగించాలి అనుకుంటే కనుక పేషెంట్ హిస్టరీని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
చర్మం, మృదు కణజాల ఇన్ఫెక్షన్‌లకు ఐదు రోజులు, సాధారణ న్యుమోనియా విషయంలో ఐదు రోజులు, ఆసుపత్రిలో ఉన్న సమయంలో సోకిన న్యుమోనియాకు ఎనిమిది రోజుల యాంటీబయోటిక్ చికిత్స అందించాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు పేర్కొన్నాయి. ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించేందుకు జ్వరం, ప్రోకాల్సిటోనిన్ స్థాయిలు, తెల్ల రక్తకణాల సంఖ్య, రేడియాలజీ వంటివాటిపై ఆధారపడకుండా.. క్లినికల్ డయోగ్నసిస్ చేపట్టాలని పేర్కొంది. తద్వారా సరైన యాంటీబయోటిక్ ఇవ్వొచ్చని తెలిపింది. రక్త పరీక్షలు, సంబంధిత యాంటీబయోటిక్ పనిచేస్తుందా? లేదా? అనేది పరీక్షించకముందే అందించే యాంటీబయోటిక్ చికిత్సా విధానాన్ని తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారి విషయంలో తగ్గించాలని సూచించింది.