అలెర్ట్, తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా..?
గోరువెచ్చని నీళ్లతో స్నానం ముందర కాస్తంత వ్యాయామం మంచిది. కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయకూడదు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తిన్న వెంటనే స్నానం అంత మంచిది కాదు. ఆహారం జీర్ణం కావాలంటే కడుపుకు రక్తప్రసరణ అవసరం. అదే స్నానం చేస్తే అది సక్రమంగా జరగదు. అయితే ప్రస్తుతం జీవన విధానం పూర్తిగా మారిపోయింది. ఉరుకుపరుగుల జీవితంలో అన్ని పనులు సక్రమంగా, సరైన రీతిలో చేయలేకపోతున్నాం. మనిషికి అత్యంత అవసరం అయిన పోషకాహారం, కంటినిండా నిద్ర లేకుండా పని చేస్తూ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.
దీనితో అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది ఏ సమయంలో ఏం పని చేయాలో తోచక సతమతమవుతుంటారు. ఇది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. తిన్న వెంటనే పడుకోవడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. కానీ ఇవి రానురాను ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయనే విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. సాధారణంగా మనం ఉదయం లేదా సాయంత్రం స్నానం చేస్తుంటాం. కొంతమంది ఉదయం స్నానం చేస్తే గాని భోజనం చేయరు. మరికొంతమంది తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు.
అయితే ఈ అలవాటు మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాని ప్రభావం అప్పటికప్పుడు కనిపించకపోయిన కొద్దిరోజులకు ఆరోగ్యంలో పలు రకాల వ్యాధులకు కారణంగా మారుతాయి. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన అనే అనారోగ్య సమస్యలు వస్తాయి. స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గి ఆహరం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే రక్త ప్రసరణ సరిగా జరగదు. దీనితో ఆహరం జీర్ణం కాకపోగా అజీర్తి లాంటి సమస్యలు వస్తాయి. ఇంకా దీని వల్ల చర్మ సమస్యలు వంటివి వస్తాయి మరి మీకు ఆ అలవాటు ఉంటే వెంటనే మానుకోండి.
ఒకవేళ మీకు ఆ అలవాటు ఉంటే భోజనం చేసిన గంట తర్వాత స్నానం చేయడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇక తిన్న తర్వాత వేడి నీళ్లతో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల వాంతులు, అల్సర్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చల్లని నీటితో స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే జీర్ణక్రియ పని కూడా సక్రమంగా ఉంటుంది. ఇదిలా ఉంటే భోజనం చేసిన 30 నిమిషాలకు స్నానం చేయడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. కాబట్టి తిన్న వెంటనే స్నానం చేయడం మానేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.