రాత్రంతా ఇంట్లోకి వెళ్లేందుకు పాము ప్రయత్నం, దీంతో ఈ కుక్క ఏం చేసిందో చుడండి.
కొన్నిసార్లు పాములు కుక్కల చేతిలో ప్రాణాలు కోల్పోతే.. మరికొన్నిసార్లు కుక్కలు ఊహించని రీతిలో పాము కాటుకు బలవుతుంటాయి. తమ ప్రాణాలు పోతాయని తెలిసినా కుక్కలు పాముతో పోరాడి తమ యజమానులను రక్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం గ్రామంలో జరిగిన ఈ పాము, కుక్కల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సురేష్ అనే వ్యక్తి బ్రూనో అనే ఓ కుక్కను గత నాలుగేళ్లుగా అతి గారాబంగా పెంచుతున్నాడు.
ఆ కుక్కను తన పిల్లల సమానంగా చూసుకుంటారు కుటుంబసభ్యులు. అయితే సురేష్ కుటుంబసభ్యులు ఎప్పటిలాగే బ్రూనోను వరండాలో వదిలేసి రాత్రి పదిగంటలకు ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. బ్రూనో బయట వరండాలో పహారా కాస్తుంది. అలా పహారా కాస్తుండగా అర్ధరాత్రి సమయంలోనే ఆరడుగుల పెద్ద నాగుపాము ఇంటి గేటులో నుండి శరవేగంగా దూసుకువచ్చింది. అది గమనించిన కుక్క వెంటనే చాకచక్యంగా పామును పట్టుకొని ఇంటి నుండి బయటకు విసిరేసింది. అలా విసిరే క్రమంలో పాము కూడా ప్రతిఘటించింది.
ఎట్టకేలకు పామును బయటకు విసిరిన తరువాత మరోసారి పాము ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేసింది. అయితే కుక్క పామును ఏ మాత్రం లోపలికి రానీయకుండా అడ్డుపడింది. పాము లోపలకి రావడానికి యత్నించడం, కుక్క అడ్డుకోవడం రెండింటి మధ్య ఘర్షణ సుమారు రెండు గంటల పాటు సాగింది. ఆ తరువాత కొంతసేపటికి కుక్క అరుపుల విన్న కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. కుక్క ఎందుకు అరుస్తుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. అంతా చిమ్మచీకటిగా ఉండటంతో అసలు ఏమి జరిగిందో? ఎందుకు అరుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు.
తరువాత టార్చ్ లైట్ వేసి కొంతసేపు వెదకగా నాగుపాము పడగ విప్పి ఇంటి గేటు వద్ద కనిపించింది. అప్పటికే సుమారు రెండు గంటల నుండి పాము ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆ తరువాత కుటుంబసభ్యులు పామును అక్కడ నుండి పంపటానికి పెద్దపెద్ద కేకలు వేసినప్పటికీ పాము ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పడగవిప్పి బుసలు కొడుతూనే ఉంది. బుసలు కొడుతున్న పాము ఒకవైపు, ఆ పామును చూసి అరుస్తున్న కుక్కను మరోవైపు. ఈ రెండింటినీ చూసిన కుటుంబసభ్యులు ఆందోళనతో కేకలు వేశారు.