షుగర్ వ్యాధి వస్తే పిల్లల్ని కనడం కష్టమేనా..? వైద్య నిపుణులు ఏం చెప్పారో తెలుసా..?
మామూలుగా స్త్రీలు సంతానోత్పత్తి పరీక్షలకు హాజరయ్యేందుకు ఏ మాత్రం సిగ్గు పడరు. కానీ మగవారు (Males) మాత్రం సంతానం కలగచేసే సామర్థ్యం తమలో ఉందో లేదో చెక్ చేయించుకునేందుకు చాలా భయపడుతుంటారు. ఒకవేళ తమలో పునరుత్పత్తి సామర్థ్యం లేదని తేలితే నలుగురు నవ్వుతారేమో అని, అత్తింట్లో మర్యాద పోతుందేమోనని, సూటిపోటి మాటలు పడాల్సి వస్తుందేమోనని వణికిపోతుంటారు. అయితే మధుమేహం నియంత్రణలో లేకపోతే స్త్రీ,పురుషులలో సంతానోత్పత్తి పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
ఈ క్రమంలో గర్భధారణ అవకాశాలను పెంచేందుకు మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రణలో ఉంచుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే మధుమేహం ప్రభావం అన్నది మగ , ఆడ ఇద్దరి పునరుత్పత్తి ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాలను చూపిస్తుంది. తద్వారా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది. మధుమేహం కారణంగా హార్మోన్ల ఉత్పత్తిలో ఆటంగాలు కలిగి గర్భధారణకు ఆటంకం ఏర్పడుతుంది. మధుమేహం అన్నది స్పెర్మ్, అండాలు, పిండాల నాణ్యతపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో DNA నిర్మాణాన్ని కూడా దెబ్బతీస్తుంది. చివరికి జన్యు ఉత్పరివర్తనలకు దారితీస్తుంది.
స్త్రీ సంతానోత్పత్తిపై మధుమేహం ప్రభావం.. ఒక మహిళ గర్భం దాల్చే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాలలో మధుమేహం కీలకమైనదని నిపుణులు చెబుతున్నారు. మధుమేహాం అన్నది టైప్ 1 మరియు టైప్ 2. ఇలా రెండు రూపాల్లో ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్ ఉంటే శరీరం జీవక్రియ కోసం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడంలో వైఫల్యం చెందుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.టైప్ 2 మధుమేహం ఉన్నవారిలో సాధారణ మొత్తంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల మధుమేహం ఉన్న మహిళల్లో గర్భస్రావాలు, ప్రసూతి సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
గర్భంధరించిన వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వలన శిశువు తక్కువ బరువుతో పుట్టేందుకు అవకాశం ఉంటుంది. అకస్మాత్తుగా గర్భాశయంలోనే శిశువు మరణించే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్న స్త్రీలు భవిష్యత్తులో మధుమేహం వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ప్రసవానికి ముందు రక్తపోటు ప్రమాదం రెండింతలు పెరుగుతుంది. పురుషుల సంతానోత్పత్తిపై మధుమేహం ప్రభావం.. మధుమేహం పురుషులలో సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది. వాస్తవానికి టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశం మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్న పురుషులు సంతానోత్పత్తి పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. మధుమేహం స్పెర్మ్ నాణ్యతను తగ్గించడం, అంగస్తంభన , స్ఖలనం ఇలా సంతానోత్పత్తి పై ప్రభావం చూపుతుంది. సంతానోత్పత్తి సమస్యలను నివారించటానికి.. సంతానోత్పత్తి సమస్యలు ఎదురుకాకుండా ఉండాలంటే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రించుకోవాలి. వైద్యుల పర్యవేక్షణలో తగిని సూచనలు, సలహాలు తీసుకుంటూ వాటిని తూచతప్పకుండా పాటించాలి. సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. ధూమపానం మానేయాలి. ఒత్తిడి లేకుండా ,సాధారణ శారీరక శ్రమ చేయాలి.