కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కనిపిస్తున్నాయా..? తొలగిచుకోవడం ఎలానో తెలుసుకోండి.
కళ్లను పదే పదే రుద్దడం చాలా మంది చేసే తప్పు. ఇలా కళ్ళను రుద్దడం వల్ల పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. దీని కారణంగానే కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి. అయితే ఈ నల్లటి వలయాలు వారి ముఖ సౌందర్యాన్ని చెడగొడతాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, అలర్జీలు, జ్వరాలు వచ్చి తగ్గడం, హైపర్ పిగ్మంటేషన్, కళ్ల చుట్టూ చర్మం పల్చగా మారడం, ఐరన్ లోపం, ఎక్కువగా ఎండలో ఉండటం, ధూమపానం, థైరాయిడ్, సరిపడా నీరు తాగకపోవడం, జన్యుపరమైన కారణాల వల్ల ఇవి చాలా మందికి వస్తుంటాయి.
నిమ్మ జాతి పండ్లు తినాలి..కళ్ల చుట్టూరా నల్లటి వలయాలతో ఇబ్బందులు పడేవారు ఎక్కువగా సీ విటమిన్ ఉండే ఆహార పదార్థాలను తినాలి. విటమిన్ సీ అనేది ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షించి ఇలాంటి వాటి నుంచి కాపాడుతుంది. అందుకు నిమ్మ, ఉసిరి, క్యాప్సికం, కివి, బెర్రీలు, కమలాపండ్లు, జామకాయలు లాంటి వాటిని రోజూ తీసుకుంటూ ఉండాలి. అలాగే లైకోపీన్ అనేది మన చర్మాన్ని పిగ్మంటేషన్ నుంచి కాపాడుతుంది. ఇది టమోటాలు, పుచ్చ కాయలు, క్యాప్సికం, క్యారెట్లు, జామ కాయలు తదితరాల ద్వారా పుష్కలంగా లభిస్తుంది.
ఆకు కూరలు ఎంతో అవసరం.. శరీరంలోని కణ జాలాలు అన్నింటికీ పుష్కలంగా ఆక్సిజన్ సరఫరా కావాలంటే ఐరన్ సరిపడనంతగా ఉండాలి. ఇది పాల కూర, బచ్చలి, గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, పప్పు ధాన్యాలు, ఆకు కూరల్లో పుష్కలంగా లభిస్తుంది. అలాగే కళ్ల కింద నలుపుల్ని తగ్గించడంలో విటమిన్ ఈ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పొద్దు తిరుగుడు గింజలు, బాదాం, అవకాడో, వేరు శెనగ గింజలు, బంగాళ దుంప లాంటి వాటిని తినడం వల్ల ఇది సమృద్ధిగా మనకు లభిస్తుంది. ప్రశాంతమైన నిద్ర కావాలి..పాడైపోయిన కణజాలాలను బాగు చేయడంలో విటమిన్ కే అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆకు కూరలు, బ్రోకలీ, క్యాబేజ్, లెట్యుస్ లాంటి వాటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మం బాగవుతుంది. ఇలాంటి ఆహారాలను తీసుకుంటూ ముఖాన్ని మంచి క్లెన్సర్‌తో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తినే ప్రయత్నం చేయాలి. రోజుకు కనీసం మూడు లీటర్ల వరకు నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే సాయంత్రం ఆరు, ఏడింటికి రాత్రి భోజనాన్ని పూర్తి చేసేయాలి. ఎనిమిది గంటల పాటు ప్రశాంతమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆహారాల్లో అలవాట్లలో ఈ మార్పులు చేసుకోవడం వల్ల కళ్లకింద వలయాలు చెప్పుకోదగ్గ రీతిలో తగ్గుముఖం పడతాయి.