Health

దాల్చిన చెక్కతో ఆ క్యాన్సర్ కు చెక్ పెట్టొచ్చు. ఎలానో తెలుసా..?

దాల్చినచెక్క అనేది శతాబ్దాలుగా వంటలో, సహజ ఔషధ నివారణగా వినియోగిస్తున్న మసాలా. ఇది సిన్నమోమమ్ కుటుంబానికి చెందిన చెట్ల బెరడు నుంచి తయారవుతుంది. శ్రీలంక, ఇండోనేషియా, భారత్ దేశాలకు చెందినది. దాల్చినచెక్క తీపి, స్పైసీ రుచిని కలిగి ఉంటుంది. అయితే భారతీయులు వంటల్లో తరచుగా ఉపయోగించే వాటిల్లో దాల్చిన చెక్క ఒకటి. ఇప్పటికే దాల్చిన చెక్క గురించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకున్నాం. కేవలం మసాలాల్లో ఉపయోగించే దాల్చిన చెక్కతో.. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

అన్ని అద్భుతమైన ఉపయోగాలు దాల్చిన చెక్కలో ఉన్నాయి. దాల్చిన చెక్కను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తూంటారు. దాల్చిన చెక్కలో రోగ నివారణ గుణాలున్నాయని ఆయుర్వేదం ఎప్పుడో తేల్చింది. అలాగే దాల్చిన చెక్క ద్వారా మొండి రోగాలని నియంత్రించవచ్చని అల్లోపతి వైద్యం కూడా వెల్లడించింది. తాజాగా దాల్చిన చెక్క ప్రోస్టేట్ క్యాన్సర్ కు కూడా చెక్ పెడుతుందని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించింది. దాల్చిన చెక్కపై ఎన్ఐఎన్ సంస్థ జరిపిన అధ్యయనాల్లో ఇది తేలింది.

దాల్చిన చెక్క, చైనా మాల్దీహైడ్, ప్రొసైనాడిన్ బీ-2లను ఎలుకలకు అందించినప్పుడు ప్రాథమిక దశలోని ప్రోస్టేట్ క్యాన్సర్ పై సానుకూల ప్రభావం చూపినట్లు ఈ అధ్యయన సంస్థ తేల్చింది. ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ఎలుకలకు 16 వారాల పాటు దాల్చిన చెక్క, దీంతో పాటు చైనా మాల్దీహైడ్, ప్రొసైనాడిన్ బీ-2లను అందించారు. ఆ తర్వాత వాటిని పరీక్షించగా.. ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు 60 శాతం నుంచి 70 శాతం వరకూ తగ్గిపోయాన్నారు. అలాగే దాల్చిన చెక్కను తరుచూ తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయని వెల్లడించారు.

ఈ పదార్థాలు శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను సమర్థవంతంగా తట్టుకోగలగడం వల్లనే వాటికి క్యాన్సర్ సోకలేదని ఎన్ఐఎన్ ఎండోక్రైనాలజీ డిపార్ట్ మెంట్ డాక్టర్ ఆయేషా ఇస్మాయిల్ తెలిపారు. దాల్చిన చెక్క ప్రోస్టేట్ గ్రంథిలో క్యాన్సర్ కణాల వ్యాప్తి కూడా తక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని చెప్పారు. అయితే ఈ పరిశోధన ఎలుకల్లో సక్సెస్ అయినప్పటికీ.. మనుషుల్లో వాడకానికి సంబంధించిన మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని సంస్థ డైరెక్టర్ ఆర్ హేమలత తెలిపారు. ‘క్యాన్సర్ ప్రివెన్షన్ రీసెర్చ్ జర్నల్’ లో తాము నిర్వమించిన పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయని సైంటిస్టులు వెల్లడించారు.

దాల్చిన చెక్కతో అనేక ఉపయోగాలు.. కాగా దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబయల్ ఉంటాయి. ఇది వివిధ వ్యాధుల నుంచి అనారోగ్య సమస్యలను నుంచి రక్షిస్తుంది. కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, గుండెకు సంబంధిత సమస్యలు, డయాబెటీస్ ను కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే అనేక ఫంగల్ ఇన్ఫెక్షన్ లనుంచి దాల్చిన చెక్క కాపాడుతుంది. బీపీ, చెడు కొలెస్ట్రాల లను తగ్గిస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker