ప్రతి రోజూ పరగడుపున నాలుగు ఆకులు తింటే డాక్టర్ దగ్గరకి వెళ్ళాల్సిన పని రాదు.
తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు. అయితే ఆకుల నుండి విత్తనం వరకు అన్నీ ఆరోగ్యానికి ఉపకరించేవే. పవిత్రమైన తులసి మొక్క శరీరం, మనస్సు మరియు ఆత్మకు టానిక్‌గా పరిగణించబడుతుంది. వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి మొక్క యొక్క వివిధ భాగాలను ఆయుర్వేద వైద్యులు సిఫార్సు చేస్తారు.
బ్రాన్‌కైటిస్ సమస్య నివారణకు తాజా పువ్వులను ఉపయోగించాలి. మలేరియా జ్వరం నుంచి ఉపశమనం కోసం నల్ల మిరియాలతో కలిపి తులిసి ఆకులు లేదా విత్తనాలను కలిపి తీసుకోవాలి. విరేచనాలు, వికారం, వాంతులతో ఇబ్బంది పడుతుంటే నాలుగు తులసి ఆకులకు కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కడుపులో వికారం తగ్గుతుంది. తామరతో బాధపడుతుంటే తులసి ఆకులను మెత్తగా నూరి ఆ భాగంలో లేపనం చేస్తే తగ్గుముఖం పడుతుంది. అనేక అధ్యయనాల ప్రకారం తులసి ఆరోగ్య ప్రదాయిని. ప్రతి ఇంటా తులసి మొక్క ఉండడం అనివార్యం. తులసి ఆకుల్లో విటమిన్ ఎ, సి.. కాల్షియం.. జింక్.. ఇనుము.. క్లోరోఫిల్ ఉన్నాయి.
తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నట్లయితే ఓసారి డాక్టర్‌ని సంప్రదించి ఈ ఆకులు తీసుకోవడం ఉత్తమం. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. తులసి మొక్కలోని అన్ని భాగాలు అడాప్టోజెన్‌గా పనిచేస్తాయి. అడాప్టోజెన్ అనేది శరీరం ఒత్తిడికి గురైనప్పుడు మానసిక సమతుల్యతను ప్రోత్సహించే ఒక సహజ పదార్ధం. అనేక రకాల ఒత్తిడిలను ఎదుర్కునేందుకు తులసి ఉపయోగపడుతుంది. ఈ ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలో తేలింది. ఆయుర్వేదం మరియు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ జర్నల్ ప్రకారం, తులసిలో యాంటి డిప్రెసెంట్ లక్షణాలు ఉన్నాయని కనుగొన్నారు. ఒక అధ్యయనంలో ప్రతిరోజూ 500 మిల్లీగ్రాముల (మి.గ్రా) తులసి సారం తీసుకున్న వ్యక్తులు తక్కువ ఒత్తిడి, నిరాశకు గురవుతున్నట్లు కనుగొన్నారు.
ఆయుర్వేద వైద్యులు ఆకులను ఉపయోగించి తులసి టీ తాగమని సిఫార్సు చేస్తారు. ఇది కెఫిన్ లేనిది కనుక ప్రతిరోజూ త్రాగడానికి సిఫార్సు చేయబడింది. ఈ టీ తాగడం అనేది యోగా వలె మనసుకు ప్రశాంతతని ఇస్తుంది. తులసి చేదుగా ఉందని తీసుకోలేకపోతే సప్లిమెంట్ రూపంలోనూ అందుబాటులో ఉంది. అయితే ఒక మూలికను దాని సహజ రూపంలో తీసుకున్నప్పుడు అందులోని ఔషధ గుణాలు పోకుండా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉండే తులసి మొక్క పవిత్రతకు ప్రతి రూపం. పూజకు ఉపయోగించే మొక్క ఆకులను తెంచకుండా.. మరో కుండీలో వేసుకున్న తులసి మొక్క ఆకులను ప్రతి రోజూ పరగడుపున ఓ నాలుగు తింటే అనారోగ్య సమస్యలు దరి చేరవు.