రోజుకి 2 కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
కాఫీ అనేది ఒక ఉత్తేజపానీయము. కాఫీ చెట్ల పండ్ల నుండి లభించే గింజలను ఎండబెట్టి, వేగించి, పొడి చేసి, కాఫీ తయారీకి ఉపయోగిస్తారు. కాఫీగింజలను దాదాపు 70 దేశాలలో పండిస్తున్నారు. కాఫీ పంటను ముఖ్యముగా లాటిన్ అమెరికా, దక్షిణా ఈశాన్య ఆసియా, ఆఫ్రికా ప్రాంతాలలో విస్తారంగా పండిస్తున్నారు. వేగించని పచ్చి కాఫీ గింజల వాణిజ్యము ప్రపంచంలో అత్యధికంగా జరిగే ప్రసిద్ధ వాణిజ్యాలలో ఒకటి. కాఫీ గింజలలో ఉన్న కాఫి అనే పదార్ధము మానవులను ఉత్తేజపరుస్తుందని ఊహించబడుతుంది. కాఫీ ప్రపంచంలో అత్యధికంగా సేవించే ఉత్తేజపానీయము.
కాఫీ అనేది ఒక ప్రసిద్ధ పానీయం. ప్రపంచ వ్యాప్తంగా అన్నిప్రాంతాలలో దొరికే ఈ పానీయం, పెద్దల నుండి పిన్నల వరకు అనేకులు అలవాటు పడిన ఉత్తేజపానీయము. కాఫీ గింజలను సువాసన వచ్చేవరకు వేగించి, పొడిచేసి, దానిని నీటితో మరిగంచి, ఆ నీటిని వడకట్టి కాఫీ డికాక్షన్ తయారు చేస్తారు. అయితే కాఫీ ప్రియులకు నిజంగా ఇది శుభవార్తే. ఉదయం లేవగానే ఓ కప్పు వేడి వేడి కాఫీ పడితేనే బుర్ర పని చేస్తుంది. పనులు చక చకా చేయాలనిపిస్తుంది కాఫీ ప్రియులకు.
ఒక కప్పు కాఫీ అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుందని పరిశోధకులు కూడా చెబుతున్నారు. తాజా పరిశోధనల ప్రకారం కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధిని దూరం చేసుకోవచ్చు. ఈ అధ్యయనం ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్ న్యూరోసైన్స్ జర్నల్’లో ప్రచురించబడింది. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవాన్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు 200 మందిపై పదేళ్లపాటు నిర్వహించిన అధ్యయనాల్లో అధికంగా కాఫీ తాగే వారిలో అల్జీమర్స్ వంటి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తక్కువగా తలెత్తుతాయని గుర్తించారు.
ఈ అధ్యయనాల్లో కాఫీకి, జ్ఞాపకశక్తికి మధ్య సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధికి కీలకమైన అమిలాయిడ్ ప్రోటీన్‌ని నిరోధించడంలో కాఫీ ఎక్కువగా సహాయపడుతుందని డాక్టర్ గార్డనర్ వివరించారు. అల్జీమర్స్ వ్యాధి ఆగమనాన్ని ఆలస్యం చేయడంలో కాఫీ సహాయపడుతుందని అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఇంట్లో తయారు చేసిన కప్పు కాఫీ 240 గ్రా అయితే, రోజుకు రెండు కప్పులు తీసుకోవడం ద్వారా మతిమరుపును నివారించ వచ్చు అని డాక్టర్ గార్డనర్ చెప్పారు. మెదడు ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపించే అంశాలు కాఫీలో ఏ భాగాలు ఉన్నాయనేది పరిశోధకులు ఇంకా ఖచ్చితంగా గుర్తించలేదు.