ఈ ఆహారం తరచూ తింటుంటే వయసు పెరుగుతున్న మీ ఎముకలు ధృడంగా ఉంటాయి.
వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడతూ ఉంటాయి. క్యాల్షియం లెవెల్స్ తగ్గడంతో ఎముకలు పటుత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. ఎప్పుడూ దృఢమైన ఎముకలు ఉండాలంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బలమైన ,ఆరోగ్యకరమైన ఎముకలు శరీర దారుఢ్యానికి ఎంతో అవసరం. ఎముకల బలం అంటే మనకు మొదట గుర్తు వచ్చేది కాల్షియం. మనం తీసుకునే ఆహారంలో క్యాల్షియంతో పాటు అవసరమైన విటమిన్లు ఉంటేనే మనకు మన శరీరానికి కావలసిన పోషక విలువలు అందుతాయి.
ఎముకలు గట్టిగా ఉండాలి అంటే కాల్షియం మూల స్తంభం లాంటిది అయితే దీనితో పాటుగా ఇతర పోషకాలకు కూడా ఇందులో ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది అన్న విషయం చాలామంది విస్మరిస్తారు. మనం తీసుకునే ఆహారంలో సరియైన శాతంలో ఐరన్ లోపిస్తే అది మన రక్తంపైనే కాదు ఎముకల ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది. మామూలుగా అందరూ ఐరన్ తీసుకుంటే రక్తం పడుతుంది అనుకుంటా ఎముకలు బలపడతాయి అని గుర్తించరు. ఎముకల ఆరోగ్యం కోసం సరైన మోతాదులో మనం క్రమం తప్పకుండా కొన్ని విటమిన్లను కూడా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ డి, విటమిన్ కె ,విటమిన్ సి మన ఎముకల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైన విటమిన్స్. మనం తీసుకునే ఆహారంలో ఈ విటమిన్లు సరియైన మోతాదులో లేకపోతే అది మన ఎముకల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ విటమిన్ లను మాత్రల రూపంలో తీసుకునే కంటే కూడా సహజమైన ఆహార రూపంలో రోజువారి డైట్ గా తీసుకోవడం చాలా శ్రేష్టం. అనవసరమైన కెమికల్స్ తో నిండిన సప్లిమెంట్స్ తీసుకునే కంటే కూడా నాచురల్ గా దొరికే కూరగాయలు పండ్లు ఆకుకూరలు వంటి వాటి ద్వారా విటమిన్లు మన శరీరానికి అందే విధంగా చూసుకోవడం చాలా మంచిది.
విటమిన్ డి అనేది మష్రూమ్స్ లో ఎక్కువగా లభిస్తుంది. రోజు ఉదయం 8 లోపు సూర్యరసిని మన శరీరానికి సోకే విధంగా ఒక్క అరగంట ఉండగలిగితే మనకు రోజువారి అవసరమైన విటమిన్ డి సులభంగా లభిస్తుంది. సూర్యకాంతి విటమిన్ డి కి గని లాంటిది. అందుకే ఎప్పటినుంచో మన పెద్దలు రోజు పొద్దున నిద్రలేచి ఒక అరగంట అయినా ఎండలో ఉండాలి అని చెబుతారు. ఇలా చేయడం వల్ల విటమిన్ డి శరీరానికి అందమే కాకుండా మన చర్మం మీద స్వేద గ్రంధులు అక్టివేట్ అయ్యి చర్మం కాంతివంతం అవుతుంది.
విటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మకాయను రోజుకు ఒకటైన జ్యూస్ రూపంలో తాగవచ్చు. ఇక నిమ్మ జాతికి చెందిన నారింజ , కమలా ..ఇలాంటి పలు రకాల సిట్రస్ ఫ్రూట్స్ తినవచ్చు. కివి ,డ్రాగన్ ఫ్రూట్ , ఆమ్లా లో కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. బ్రోకలీ, క్యాబేజీ, పాలకూర వంటివి తీసుకోవడం వల్ల విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంది. రోజువారి డైట్ లో ఇవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమైన సప్లిమెంట్స్ అందివ్వడమే కాకుండా ఎముకల ఆరోగ్యాన్ని కూడా పదిలంగా కాపాడుకోవచ్చు.