సీపీఆర్ ఎలా చెయ్యాలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే..?
మాసివ్ హార్ట్ అటాక్ వచ్చిన వారు హఠాన్మరణం చెందుతారని డాక్టర్ విరించి విరివింటి తెలిపారు. ‘మాసివ్ హార్ట్ ఎటాక్ వస్తే బతకడం కష్టం. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొందరు నీళ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఒకతను కళ్లు తిరిగి పడిపోతే.. మేం అక్కడికి వెళ్లేసరికి నోట్లో నీళ్లు పోసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేయకూడదు. అయితే ఏజ్‌తో సంబంధం లేకుండా.. జెండర్‌తో లింక్ లేకుండా.. ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ మరణాలు పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా సడెన్ కార్డియాక్ అరెస్ట్ (ఎస్‌సీఏ) వస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.
దీంతో గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాలను కాపాడే సీపీఆర్‌పై అవగాహన పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతి ఒక్కరూ సీపీఆర్ ఎలా చేయాలో నేర్చుకోవాలంటున్నారు డాక్టర్లు. ముందుగా పడిపోయిన వ్యక్తి చేతికి పల్స్ ఉందా? లేదా? చెక్ చేయాలి. గుండె మీద చేయి పెట్టి కొట్టుకుంటుందా? లేదా? చూడాలి. ఒకవేళ గుండె కొట్టుకోవడం గానీ, చేతి మీద పల్స్ గానీ లేకపోతే వెంటనే సీపీఆర్ స్టార్ట్ చేయాలి. రైట్, లెఫ్ట్ ఫింగర్స్ మధ్య పేషెంట్ చాతీ మధ్య భాగంలో నొక్కాలి. గుండెపై నొక్కద్దు. నొక్కేటప్పుడు మన చేతులు మోచేతులు బెండ్ కాకూడదు.
చేతులు స్టిఫ్‌గా ఉంచి నొక్కాలి. చాతీ కనీసం 5 సెంటిమీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి. విముకలు విరిగిపోతాయని భయపడకూడదు. నిమిషానికి వందసార్లు, అంతకంటే ఎక్కువగా చేయాలి. ఒక నిమిషం చేసిన తర్వాత పల్స్ చెక్ చేయండి. పల్స్ దొరకకపోతే మళ్లీ కొనసాగించాలి. ఒక్కోసారి 20 నిమిషాలు చేస్తూనే ఉండాలి. కంటిన్యూయస్‌గా చేస్తున్నప్పుడు గుండె మళ్లీ కొట్టుకునే అవకాశం కలుగుతుంది. పిల్లలకు, శిశువులకు కూడా ఇదే పధ్ధతి.
అయితే పిల్లలకు ఛాతి మధ్యలో ఒక చేత్తోనే నొక్కాలంటారు డాక్టర్లు. శిశువుకి రెండు వేళ్లుతో మాత్రమే మెల్లగా నొక్కుతూ ఉండాలని చెబుతారు. శ్వాస ఆగిపోకుండా చూడడం, గుండె చప్పుడు రికవరీ అయ్యేలా చూడడం, రక్త సరఫరా తిరిగి పునరుద్ధరించబడటం సీపీఆర్ లక్ష్యం.. సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్‌కు ఫోన్ చేయడం మర్చిపోవద్దు.. ఆస్పత్రికి ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిది. నోటి ద్వారా శ్వాస అందించడంపై అనేక వాదనలున్నాయి.
మామూలుగా పదిహేనుసార్లు చేతితో ఛాతిపై ఒత్తిన తర్వాత రెండుసార్లు రోగి నోటిలో నోరు పెట్టి శ్వాస అందించాలని చెబుతుంటారు. ఆ తర్వాత 30సార్లు ఛాతిపై అదిమిన తర్వాత రెండుసార్లు నోటితో శ్వాస అందిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని తేలింది. అప్పటి నుంచి కొంత మంది ఇదే పాటిస్తున్నారు. అయితే తర్వాత కూడా రూల్స్ మారాయి. నోరు పెట్టి గాలి ఊదడం లాంటివి చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని… సీపీఆర్ మీదే దృష్టి పెట్టడం ఉత్తమమని డాక్టర్లు చెబుతున్నారు.