ఈ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు ఆ సమస్యలతో బాధపడుతున్నారు.
భారత్ బయోటెక్ కంపెనీ ఈ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తయారుచేస్తోంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మూడో వంతు వ్యక్తులకు తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చాయని బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. 926 మందిపై BHU పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది. వీరిలో 635 మంది యంగ్ ఏజ్ వారు కాగా.. 291 మంది మధ్య వయస్సు వారు ఉన్నారు. అయితే కరోనా నుంచి రక్షణ కోసం కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఆందోళన కలిగిస్తున్న తరుణంలో..
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా గురించి కూడా ఆందోళనకర విషయం బయటపడింది. ఈ టీకా తీసుకున్న వారిలో 30 శాతం మంది తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్‌లో ప్రచురించారు. కోవాగ్జిన్ తీసుకున్న 926 మందిపై బీహెచ్‌యూ పరిశోధనలు చేసింది. వీరిలో 50 శాతం మంది తాము ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. వారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు.
ఒక్క శాతం వ్యక్తుల్లో ఏఈఎస్ఐతోపాటు గులియన్ బారీ సిండ్రోమ్‌లాంటి లక్షణాలు కనిపించినట్లు తేలింది. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 30 శాతం మంది ఏడాది తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆ అధ్యయనం సారాంశం. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు వచ్చినట్లు స్టడీ వెల్లడించింది. 2022 జనవరి నుంచి 2023 ఆగస్టు వరకు అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో 635 మంది యుక్త వయస్కులు, 291 మంది పెద్దలు పాల్గొన్నారు.
4.6 శాతం మంది స్త్రీలలో రుతుక్రమం సమయంలో అసాధారణ పరిస్థితి నెలకొనడాన్ని అధ్యయనం హైలెట్ చేసింది. 2.7, 0.6 శాతం మందిలో వరుసగా కంటి సంబంధిత సమస్యలు, హైపోథైరాయిడిజం గమనించారు. పెద్దవారిలో నాలుగు మరణాలు (ముగ్గురు స్త్రీలు, ఒక పురుషుడు) నమోదయ్యాయి. నలుగురికి కొత్తగా మధుమేహం వచ్చింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతున్నారు. తాజా అధ్యయనం కోవాగ్జిన్ టీకా తీసుకున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది.