News

వాతావరణ శాఖ అలర్ట్‌, ఉరుములు, రాగల 24 గంటలలో మెరుపులతో భారీ వర్షాలు.

దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, గంగానది పశ్చిమంలో నైరుతి రుతుపవనాలు ఇప్పుడు బలహీనపడ్డాయని వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. బెంగాల్, జార్ఖండ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రాంతం, సౌరాష్ట్ర, కచ్, కొంకణ్, గోవా, ఛత్తీస్‌గఢ్, రాయలసీమ, తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో రుతుపవనాలు బలహీనపడినట్లు ఐఎండీ తెలిపింది.

అయితే సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటలలో పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దాని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ, రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే చాన్స్‌ ఉంది.

తెలంగాణలోని 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించిన వాతావరణ శాఖ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. అలాగే.. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. ప్రధానంగా.. ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గత రెండు రోజుల నుంచి రాత్రైతే చాలు వరుణుడు విరుచుకుపడుతున్నాడు. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా వెదర్‌ ఛేంజ్‌ అయి వర్షం పడుతోంది.

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒకట్రెండు గంటలు భారీ వర్షం పడుతోంది. సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు మలక్ పేట, దిల్ షుఖ్ నగర్, కాచిగూడ, సైదాబాద్, చాదర్ ఘాట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker