సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులు, 12th ఫెయిల్ సినిమా రిపీట్ చేసిన సాయి కిరణ్.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2023 తుది ఫలితాల్లో 1,016 మందిని ఎంపిక చేశారు. 180 మంది ఐఏఎస్ (IAS)కు, 37 మంది ఐఎఫ్ఎస్(IFS) కు, 200 మంది ఐపీఎస్ (IPS)కు ఎంపికయ్యారు. సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్-ఏ కేటగిరిలో 613 మంది, గ్రూప్-బి సర్వీసెస్ లో 113 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్ సర్వీసెస్-2023 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 50 అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. అయితే కరీంనగర్ జిల్లాకు చెందిన నందాల సాయి కిరణ్ జీవితంలోకి తొంగి చూస్తే ప్రస్తుతం కొండంత ఆనందం కనిపిస్తోంది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల కాంతయ్య మహారాష్ట్రలోని భీవండిలో పవర్ లూమ్స్ కార్మికునిగా పనిచేస్తుండగా క్యాన్సర్ బారిన పడడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను చూసుకుంటూ పిల్లలను చదివించుకుంటూ తల్లి లక్ష్మీ జీవనం సాగించారు. బీడీలు చుడుతూ వచ్చిన ఆదాయంతో అటు కటుంబాన్ని పోషిస్తూ.. ఇటు పిల్లలను చదివించారు. తల్లి కష్టం చూస్తూ పెరిగిన బిడ్డలు ఈ కష్టాలకు పుల్ స్టాప్ పెట్టాలన్న లక్ష్యంతోనే చదువులో రాణించారు. కూతురు స్రవంతి బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుని మిషన్ భగీరథలో ఏఈఈగా ఉద్యోగం చేస్తున్నారు.
కుటుంబ స్థితి గతుల దృష్ట్యా జాబ్ చేస్తూనే సివిల్స్ ప్రిపేర్ కావల్సిన పరిస్థితి సాయి కిరణ్ ది. తొలిసారి ప్రయత్నంలో విఫలం కావడంతో ఉద్యోగం వదిలేసి సివిల్స్ ప్రిపేర్ కావాలని అనుకున్నాడు. కానీ సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఉన్న ఉద్యోగం వదులకుంటే ఇబ్బందని బంధువులు చెప్పడంతో అటు ఉద్యోగం చేస్తూనే ఇటు కోచింగ్ తీసుకున్నాడు. తన బాబాయ్ శ్రీనివాస్‌తో మాట్లాడినప్పుడల్లా తాను సివిల్స్ కొట్టి గోల్ రీచ్ అవుతానంటూ ఘంటా పథంగా చెప్పేవాడు. అదే మార్గంలో ప్రయాణించి సాయి కిరణ్ రెండో ప్రయత్నంలోనే యూపీఎస్సీ 27వ ర్యాంకు సాధించాడు.
నిరుపేద కుటుంబానికి చెందిన సాయికిరణ్ సివిల్స్ లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్దేశించే వారు లేకున్నా తనకు తానే టార్గెట్ ఫిక్స్ చేసుకుని గమ్యాన్ని చేరుకున్నాడు. సివిల్ప్ ప్రిపేరేషన్ అనగానే భారీ కసరత్తులు చేయాల్సి వస్తోందన్న భయం వెంటాడుతున్న వారికి సాయి కిరణ్ ఛేజింగ్ స్టైల్ ఆదర్శంగా నిలుస్తోంది. తండ్రి మరణించడంతో తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న తీరును కళ్లారా చూసిన ఆ బిడ్డ తన లక్ష్యాన్ని ముద్దాడిన తీరు పదే పదే నిరాశకు గురయ్యే వారంతా ఫాలో అయితే సక్సెస్ దానంతట అదే వస్తుందని గుర్తు చేస్తోంది.
ఆయన కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యేందుకు కావల్సిన లిట్రేచర్తో పాటు కోచింగ్‌కు అవసరమైన డబ్బును సమకూర్చుకుంటూ.. అక్క ప్రోత్సాహంతో ముందుకు సాగిన తీరు నేటి తరానికి రోల్ మోడల్ అనే చెప్పాలి. సాయి కిరణ్ జీవన గమనాన్ని తెలుసుకుంటే అమ్మో సివిల్సా అని భయపడే యువతలో సరికొత్త ఆశ చిగురించడం ఖాయం.