చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి. ఎందుకంటే..?
మానవజీవితంలో శారీరక పెరుగుదల పుట్టిన మొదటి సంవత్సరంలో ఎక్కువగా చూస్తాము. మరల తిరిగి కౌమార వయస్సులో శారీరక మార్పులతో కూడిన పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది. మానవజీవితంలో పెరుగుదల అభివృద్ధికి సంబంధించి ఈ రెండు దశలు ముఖ్యమైన సమయాలు. అయితే చిన్నారుల్లో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో పులిపిర్లు కూడా ఒకటి. హ్యుమన్ పాపిలోవా వైరస్ కారణంగా త్వరగా వ్యాపించే వైరస్ల వల్ల చిన్న పిల్లల్లో పులిపిరి సమస్య కూడా కనిపిస్తుంది.
ప్రధానంగా చేతులు, ముఖం, మెడ భాగాల్లో ఇవి ఎక్కువ కనిపిస్తాయి. ముఖంపై, చేతులపై వచ్చే పులిపిర్లతో చూడ్డానికి వికారంగా ఉంటాయి. పిల్లలు న్యూనతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. చర్మంపై పొక్కుల్లా గట్టిగా ఉండే కణజాలంతో వచ్చే పులిపిర్లలో చాలా రకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పదేళ్లలోపు చిన్నారుల్లో ఎక్కువగా ఈ సమస్యలు కనిపిస్తుంటాయి. ఇంట్లో, స్కూల్లో నేరుగా చర్మం కాంటాక్ట్ కావడం వల్ల ఒకరి నుంచి ఇతరులకు సంక్రమించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చర్మంపై అసౌకర్యంగా, చూడ్డానికి ఇబ్బందిగా మారుతాయి.
చర్మంపై ఒక ప్రాంతంలో వచ్చిన పులిపిర్లను గిచ్చడం, గోకడం వంటివి చేస్తే అవి ఇతర శరీర భాగాలకు వ్యాపిస్తుంటాయి. పులిపిర్లను అదుపు చేయడానికి నాటు మందులు, గృహ వైద్యాలను చాలామంది అవలంబిస్తుంటారు. ఇవి కొంత వరకే ఫలితం ఇస్తుంటాయి. ఇటీవలి కాలంలో వీటిని తొలగించడానికి లేజర్ చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. శరీరంపై వికారంగా కనిపించే పులిపిర్లను తొలగించడానికి లేజర్ పద్ధతి సులువుగా ఉంటుంది. వైరస్ ద్వారా శరీరంపై పెరిగిన కణజాలాన్ని సులువుగా తొలగించవచ్చు.
లేజర్లో పులిపిర్లను తొలగించడం సులువే అయినా చిన్నపిల్లలకు లేజర్ చికిత్సలు చేయకూడదని కాటూరి మెడికల్ కాలేజీ డివిఎల్ ప్రొఫెసర్ సెంథిల్ కుమార్ వివరించారు. చిన్న పిల్లలకు లేజర్ చికిత్సలు ప్రమాదకరమని,వాటితో శరీరాన్ని గాయాలకు గురి చేయడం,శాశ్వతంగా మచ్చలు పడటం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరించారు. చిన్న పిల్లల్లో పులిపిర్ల సమస్యకు చవకైన యాంటీ బయాటిక్ క్రీములతోనే అదుపులోకి వచ్చేస్తాయని చెబుతున్నారు.
చర్మంపై వచ్చిన పొక్కులు, అనవసరమైన చర్మపు కణజాలాన్ని మందులతోనే అదుపు చేయొచ్చని చెబుతున్నారు. లేజర్ ట్రీట్మెంట్స్ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లేటర్ ట్రీట్మెంట్స్ సిఫార్సు చేసిన సమయంలో నిపుణులను సంప్రదించడం ఉత్తమ పరిష్కారమన్నారు. కాస్మోటిక్ నిపుణులు చెప్పే పరిష్కారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.