పిల్లల్లో గ్రహణం మొర్రి ఎందుకు వస్తుంది..? గ్రహణం రోజునే..
పుట్టుకతోనే పిల్లల్లో సంభవించే ఓ లోపంగా గ్రహణ మొర్రిగా చెప్పుకోవచ్చు. నోటికి బయట ఉండే పై పెదవి సక్రమంగా ఉండగా ముక్కుకు దిగువన చీలి ఉంటుంది. దీనివల్ల సదరు బిడ్డ పై పెదవి రెండు తమ్మెలులాగా మనకు గోచరిస్తుంది. అయితే గ్రహణం ఏర్పడిన సమయంలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలని పూర్వకాలం నుంచి ఒక నమ్మకం ఉంది. ఆ సమయంలో వారు బయట తిరగకూడదని, శరీరంపై ఎక్కడ దురద వచ్చినా గోక కూడదని చెబుతారు. అలా చేస్తే గర్భంలోని శిశువుకు గ్రహణం మొర్రి వచ్చే అవకాశం ఉందని అంటారు. గ్రహణం మొర్రి అనేది నోటి దగ్గర వచ్చే ఒక అవకరం.
బిడ్డ పెదవులు చీలిపోయినట్లు ఉంటాయి. అంగిలి కూడా చీలినట్లు అవుతుంది. ఇలా గ్రహణం మొర్రి రావడానికి కారణం… గ్రహణం ఏర్పడిన సమయంలో గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే అని ఎంతో మంది ఇప్పటికీ నమ్ముతారు. అయితే సైన్స్ మాత్రం ఈ విషయాన్ని పూర్తిగా కొట్టి పడేస్తోంది. ప్రతి వెయ్యి జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మొర్రి రావడం సహజమని చెబుతోంది. ఆరు నుంచి పది వారాల వయసు ఉన్నప్పుడు అంటే రెండో నెల గర్భంలో బిడ్డలో తలభాగం ఏర్పడుతుంది. అప్పుడే పెదవులు, అంగిలి కూడా ఏర్పడతాయి. కొంతమంది పిల్లల్లో పెదవులు, అంగిలి కలవకుండా ఏర్పడతాయి. అప్పుడే ఇలా గ్రహణం మొర్రి వస్తుంది.
దీనికి చికిత్స చేసేందుకు ఎలాంటి మందులు ఉండవు. కేవలం శస్త్ర చికిత్స ద్వారానే నయమవుతుంది. ఇలా గ్రహణం మొర్రి రావడానికి జన్యుపరమైన లోపాలు కూడా కారణమేనని చెబుతున్నారు వైద్యులు. అలాగే కణజాలం అభివృద్ధిలో సమస్యలు ఉన్నా కూడా ఇలా పెదవి చీలినట్లు ఏర్పడుతుందని వివరిస్తున్నారు. ఈ గ్రహణం మొర్రిని ‘క్లెఫ్ట్ లిప్’ అంటారు. అంటే పెదవులు చీలినట్లు రావడం. ఇక అంగిలిలో చీలిక ఏర్పడితే దాన్ని ‘క్లెప్ట్ ప్యాలెట్’ అంటారు. ఈ రెండూ కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పడతాయి. గ్రహణానికి ఈ పెదవులు చీలడానికి ఎలాంటి సంబంధమూ లేదు. తల్లి, తండ్రి, మేనమామలో ఇలాంటి సమస్యలు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం అధికమని చెబుతున్నారు వైద్యులు.
గ్రహణం మొర్రికి శస్త్ర చికిత్స ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. గ్రహణం మొర్రి ఉంటే ఈ సమస్యలు.. గ్రహణం మొర్రి సమస్యతో పుట్టే పిల్లలు తక్కువ బరువుతో ఉంటారు. పెదవులు చీలినట్లు ఉండడం వల్ల వారు సరిగా పాలు తాగలేరు. ఇక అంగిలి కూడా చీలినట్లు ఉంటే… వారు తాగిన పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. దీని వల్ల ఇతర సమస్యలు వస్తాయి. కాబట్టి నెలల వయసులో ఉన్నప్పుడే పిల్లలకి గ్రహణం మొర్రి శస్త్ర చికిత్స చేయించడం మంచిది. పెద్దయ్యాక ఈ పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఆడుకోలేక డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. గ్రహణం మొర్రి సమస్యతో పుట్టే పిల్లల్లో కొంతమందికి గుండె సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాదాపు 30 శాతం మంది పిల్లలు ఇలా గుండె సమస్యలతో పుట్టే అవకాశం ఎక్కువ.
కాబట్టి వారికి ఈసీజీ, ఎకో కార్డియో గ్రాఫ్ పరీక్షలు కూడా చేస్తారు. గ్రహణం మొర్రి సమస్యను గర్భంలో ఉన్నప్పుడే యాంటీ నాటెల్ స్కాన్ చేసి గుర్తించవచ్చు. అయితే ఇది గర్భంలోనే నయం చేయడం అసాధ్యం. బిడ్డ పుట్టాక మూడు నెలలకు ఆపరేషన్ ద్వారా దీన్ని సరిచేస్తారు. పెదవి చీలిక వస్తే మూడు నెలల వయసులో శస్త్ర చికిత్స చేయవచ్చు. కానీ అంగిలి చీలితే మాత్రం తొమ్మిది నెలల తర్వాతే బిడ్డకు శస్త్ర చికిత్స చేస్తారు. గ్రహణం మొర్రి రాకుండా అడ్డుకోవడం అసాధ్యం. అయితే గర్భంతో ఉన్నప్పుడు మంచి పోషకాహారం తినడం, ఒత్తిడి లేకుండా జీవించడం, పాజిటివ్ ఆలోచనలతో ముందుకు వెళ్లడం, వ్యాయామాలు చేయడం వంటివి ద్వారా గ్రహణం మొర్రి వచ్చే అవకాశాలను మాత్రం కొద్దిగా తగ్గించుకోవచ్చు.