చెవిలో చీము వస్తుందా..? మీరు వెంటనే ఏం చెయ్యాలంటే..?
చెవిలోని కర్ణభేరి పగిలి అక్కడ సూక్ష్మక్రిములు చేరి చీమును తయారు చేస్తాయి. ఇది సరిగా చికిత్స చేయకపోతే పూర్తిగా చెముడు వచ్చేస్తుంది. కొన్ని సందర్భాలలో మెదడుకు పాకి మెదడు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే పిల్లల్లో జలుబు తర్వాత శ్వాస వ్యవస్థకు వచ్చే సర్వ సాధారణ రుగ్మత ఇది. కొన్నిసార్లు ఇతర వ్యాధులకు తీసుకునే మందుల ప్రభావంతో దానంతట అదే తగ్గిపోవచ్చు. మన చెవిని మూడు భాగాలుగా విభజిస్తారు.. బయటి చెవి, మధ్య చెవి, లోపలి చెవి. చీము ఎక్కువగా మధ్య చెవిలో వస్తుంది.
అప్పుడప్పుడూ బయటి చెవిలోనూ వస్తుంది. గొంతు నుంచి మధ్య చెవికి విస్తరించిన ‘యూ స్టేషియన్ నాళం’ ద్వారా బ్యాక్టీరియా వ్యాపించడం వల్ల చీము సమస్య ఉత్పన్నం అవుతుంది. ముఖ్యంగా 6 నుంచి 20 నెలల వయసు పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. బాలికలతో పోల్చినప్పుడు బాలురకు తరచుగా వస్తుంది. తక్కువ వయసు పిల్లలకు వస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. తీవ్రతా ఎక్కువే. తిరగబెట్టే అవకాశం అధికమే. కిక్కిరిసిన నివాసాలలో, అపరిశుభ్ర పరిసరాలలో నివసించే వారిలో తరచూ కనిపిస్తుంది.
ప్రత్యేకించి వానకాలంలో, చలికాలంలో దాడిచేస్తుంది. స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, హెచ్.ఇన్‌ఫ్లుయెంజా దీనికి ప్రధాన కారకాలు. మీజిల్స్ లేదా తట్టు వచ్చినవారిలోనూ కనిపిస్తుంది. వైద్యం ఆలస్యమైతే అనేక సమస్యలకు దారితీస్తుంది. చెవిలోని చీము తల ఎముకలకు, లోపలి మెదడుకు వ్యాపించవచ్చు. ఏడో కేంద్రనాడి పక్షవాతానికి గురైతే.. ముఖ కండరాలు సరిగా పనిచేయవు. దీంతో మూతి వంకర అవుతుంది. కనురెప్పలు మూతపడవు. ఆహారం నమలడం కష్టం అవుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లో చెముడుకు ఇదో ప్రధాన కారణం. ఫలితంగా మాటలు సరిగా రాకపోవడం, భాషాపరమైన ఇతర లోపాలూ ఏర్పడవచ్చు. సరైన వైద్యంతో కర్ణభేరికి పడిన చిన్నచిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. చీము కారుతున్నప్పుడు, మెత్తని దూదితో చేసిన వత్తులతో చీమును 3-4 సార్లు శుభ్రం చేయాలి. మార్కెట్లో లభించే బడ్స్ వాడటం వల్ల, చెవిలో చీము ఇంకా లోపలికి వెళ్లవచ్చు. స్నానం చేస్తున్నప్పుడు చెవిలోకి నీరుపోకుండా దూది ఉంచడం మంచిది. వైద్యుల సలహాతో యాంటిబయాటిక్స్ వాడాలి.