విటమిన్ బి12 లోపం ప్రాణాంతకం, ఈ లక్షణాలు కనిపిస్తే ఆ లోపం ఉన్నట్లే..?
విటమిన్ బి12 లోపం ఉంటే ముఖ్యంగా కొన్ని లక్షణాలు మన శరీరంలో స్పష్టంగా కనిపిస్తాయి. విటమిన్ బి12 లోపం ఉన్నవారికి బలహీనత ఒక సాధారణ లక్షణం. ఏ పని చేయనప్పటికీ కూడా బలహీనంగా ఉంటారు. అలసిపోయినట్టుగా కనిపిస్తారు. విటమిన్ బి 12 లోపం వల్ల గుండె దడ, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. చర్మం పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. అయితే మన శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు అవసరమవుతాయి. అందులో ఏ ఒక్కటి తగ్గినా మన శరీరం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ఇలాంటి వాటిలో విటమిన్ -బి12 ఒకటి.
ఈ విటమిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడం లేదా ఈ విటమిన్ ను మీ శరీరం గ్రహించనప్పుడు మీలో విటమిన్ బి12 లోపం ఏర్పడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. వీటిని పట్టించుకోకపోతే మీ ప్రాణాల మీదికి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును ఈ సంకేతాలను పట్టించుకోకుండా వదిలేస్తే ఎన్నో డేంజర్ వ్యాధులొస్తాయి. ఈ లోపం ఎన్నో శారీరక, మానసిక సమస్యలను కలిగిస్తుంది. విటమిన్ బి12 మన శరీరంలో ఎర్ర రక్త కణాలు, డీఎన్ఎను తయారు చేయడానికి సహాయపడుతుంది.
అయితే మన శరీరం దానంతట అదే విటమిన్ -బి 12 ను తయారు చేయదు. అందుకే దీన్ని ఫుడ్ ద్వారా తీసుకోవాలి. పాలు, మాంసం మొదలైన జంతువుల నుంచి వచ్చే ఆహార పదార్థాలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అలసట.. అలసట విటమిన్ -బి12 లోపం లక్షణం. విటమిన్ బి12 రక్తం తయారు చేయడానికి సహాయపడుతుంది. ఇక ఈ పోషకం లోపిస్తే రక్తం ఏర్పడటం తగ్గుతుంది, దీని వల్ల మీ శరీరం బలహీనంగా ఉంటుంది. బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు దీనివల్ల రక్తహీనత సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది.
చర్మం రంగు మారడం.. విటమిన్ -బి12 లోపం వల్ల ఎర్రరక్తకణాలు ఏర్పడటం తగ్గుతుంది. దీంతో మీకు రక్తహీనత సమస్య వస్తుంది. దీనివల్ల మీ చర్మం రంగు పాలిపోవడం మొదలవుతుంది. శరీరంలో రక్తం తగ్గడం వల్ల మీ చర్మం రంగు పసుపు రంగులో కనిపిస్తుంది. నాలుక వాపు.. నాలుక వాపు కూడా విటమిన్ బి 12 లోపం లక్షణమేనంటున్నారు నిపుణులు. దీనిని గ్లోసిటిస్ అంటారు. దీనిలో మీ నాలుక రంగు కూడా మారుతుంది. అంటే ఎర్రగా మారుతుంది. ఈ వ్యాధితో మీ నోట్లో బొబ్బలు కూడా ఏర్పడతాయి. నడవడానికి ఇబ్బంది.. విటమిన్ -బి12 లోపం వల్ల నడవడానికి ఇబ్బంది కూడా కలుగుతుంది.
విటమిన్ బి12 లోపించడం వల్ల మీ నరాలు దెబ్బతింటాయి. న్యూరోట్రాన్స్మిటర్లను తయారు చేయడానికి విటమిన్ బి12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ లోపం వల్ల అవి ప్రభావితం అవుతాయి. ఈ లోపం వల్ల మీ పాదాలలో జలదరింపు అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు నడవడానికి ఇబ్బంది పడతారు. జ్ఞాపకశక్తిని కోల్పోవడం.. విటమిన్-బి12 నేరుగా మెదడుకు సంబంధించినది. ఇది తగ్గినా, పూర్తిగా లేకపోయినా.. ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.