అయోధ్య వెళ్లేవారికి అలెర్ట్, ప్రతిరోజూ ఈ సమయంలో దర్శనం బంద్.
ప్రస్తుతం శ్రీరాంలాలా ఐదేళ్ల బాలరాముని రూపంలో ఉన్నారు. అందువల్ల బాల దేవతకు కొంత విశ్రాంతినిచ్చేందుకు ఆలయ తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించిందని ఆచార్య సత్యేంద్ర దాస్ నివేదికలో పేర్కొన్నారు. అయితే ప్రతిష్ఠాపన కార్యక్రమం తరువాత రాంలాలా దర్శన సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంది. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 వరకు రెండు గంటల పాటు ఆలయ తలుపులు మూసివేసేవారు.
అయితే జనవరి 22వ తేదీన శ్రీరామ చంద్రుడు తన నివాసంలో కొలువుదీరారు. ఇక ఆయనను దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కోట్లాడి మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా.. ఇంకా భారీ స్థాయిలో వస్తూనే ఉన్నారు. ఫలితంగా అయోధ్య ఆలయంతో పాటు నగరం కూడా రామ భక్తులతో కిక్కిరిసిపోయింది.
ఈ నేపథ్యంలోనే వీలైనంత మంది ఎక్కువ భక్తులకు రోజూ రామయ్య దర్శనంకి ఇక్కడి ట్రస్ట్ అవకాశం కల్పించింది. ఎక్కువమంది భక్తులు అయోధ్యకు వస్తుండటంతో మొదట్లో నిర్ణయించిన దర్శన వేళలను ఆ తర్వాత పొడగించారు. తాజాగా మరోసారి బాలక్ రామ్ దర్శన వేళల్లో ఆలయ అధికారులు మార్పులు చేశారు. ఈ శుక్రవారం నుంచి అయోధ్యలో రామ మందిరాన్ని రోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు మూసివేయనున్నట్లు ప్రకటించారు.
మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల వరకు రామ్‌లల్లా దర్శనం ఉండదని ఆలయ పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు. అయోధ్య రామయ్యను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మధ్యాహ్నం వేళ మూసివేయలేదని వెల్లడించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభం అవుతున్న అయోధ్య రాముడి దర్శనాలు రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.