గుండెపోటుతో అత్త..! అత్త మరణాన్ని తట్టుకోలేక కోడలి మృతి.
గుండెపోటు ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి. ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వంశానుగతంగా వచ్చే జన్యువులు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి.
అయితే ఏ ఇంట్లోనైనా సరే అత్తాకోడళ్ల ప్రస్తావన వచ్చిందంటే వారి మధ్య జరిగే గొడవలే ముందుగా గుర్తుకు వస్తాయి. కానీ, ఓ ఇంట్లో మాత్రం అత్తగారి అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన కోడలు.. ఆమె వెంటే లోకాన్ని వీడింది. గంటల వ్యవధిలో అత్తాకోడళ్లు మరణించిన ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం జరిగింది.
యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి మధిర పంచాయతీ పరిధి గొల్లగుడిసె గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు చుక్కల భారతమ్మ(65), చుక్కల మంగమ్మ(26) గంటల తేడాలో కన్నుమూశారు. భారతమ్మకు ఇద్దరు కుమారులు కాగా మంగమ్మ చిన్న కొడుకు భార్య. అయితే, భువనగిరి మండలం రాయిగిరి గ్రామంలో ఉన్న తన తల్లి ఓ గొడవలో గాయపడడంతో పరామర్శించేందుకు భారతమ్మ శనివారం వెళ్లింది. రాత్రి అక్కడే నిద్రించింది.
అయితే, ఆదివారం ఉదయం నాలుగు గంటల సమయంలో భారతమ్మ గుండెపోటుతో మరణించింది. భారతమ్మ మృతదేహాన్ని వెంటనే స్వగ్రామం గొల్లగుడిసెకు తరలించారు. అయితే, భారతమ్మ మృతదేహం వద్ద ఏడుస్తున్న మంగమ్మ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూసింది. గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది.