ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు.
పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని..దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు, కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు విస్తాయని అధికారులు తెలిపారు. అయితే కర్ణాటక, తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. నేడు శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న ఆయన.. ఏలూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయన్నారు.
మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని హెచ్చరించారు. మరోవైపు.. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు సీఎం వైఎస్ జగన్.
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పంటలపై దాని ప్రభావం అంశంపై అధికారులతో సీఎం సమీక్షించారు. వర్షాల వల్ల రైతుల వద్ద తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు.ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలపై మొదలైన ఎన్యుమరేషన్‌ను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. నివేదిక ఖరారు చేయాలన్నారు.
ఈ నెలలో వైఎస్సార్ రైతు భరోసాతో పాటు.. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఇన్‌పుట్ సబ్సిడీ జారీకి అన్నిరకాల చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.