ఈ పండ్లు కనిపించిన వెంటనే తినేయండి. ఎందుకుంటే..?
వర్షాకాలంలో దొరికే పండ్లలో ఒకటి అల్ బుకరా. ఎర్రగా.. అందంగా కనిపిస్తూ.. చూడగానే తినాలనించేలా ఉండే ఈ పండ్లు తియ్యని, పుల్లని రుచిని కలిగి ఉంటాయి. మే నుండి అక్టోబరు మధ్య మార్కెట్‌లో కనిపించినా.. ఎక్కువగా జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో ఎక్కువగా లభిస్తాయి. వర్షాకాలంలో దొరికే వీటిని తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. అయితే చాలా మంది ఇష్టంగా తినే పండ్లు అల్ బుకరా. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు సీజనల్ గా వచ్చే ఆరోగ్య సమస్యలని కూడా ఇది సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
ఎన్నో పోషకాలు కలిగిన ఈ పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. గుండెకి మేలు.. అల్ బుకరా పండ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.. వీటిలో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. కాలేయం కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది. ఎముకలకి మంచిది.. ఈ పండ్లలో లభించే బోరాన్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
ఇందులో అదనంగా ఫినాలిక్, ఫ్లేవనాయిడ్ రసాయనాలు ఉన్నాయి. ఇవి ఎముకలకి నష్టం కలగకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తి ఇస్తుంది.. ఫ్లూ, జలుబు, జ్వరాలతో పోరాడేందుకు అవసరమైన రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. ఈ పండులోని గుజ్జు కణజాలాల పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. చర్మానికి మంచిది.. అల్ బుకరా పండ్లు తీసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది.
ముడతలని తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అందుకోసం క్రమం తప్పకుండా ఈ పండ్ల జ్యూస్ తీసుకుంటే మంచిది. మలబద్ధకం పోగొడుతుంది.. ఈ పండ్లలో ఇసాటిన్, సార్బిటాల్ ఉన్నాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించడానికి జీర్ణక్రియని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని ఎండబెట్టిన తర్వాత తీసుకుంటే గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గర్భిణులకి మేలు.. ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి ఇది చాలా మేలు చేస్తుంది. ఇవి తినడం వల్ల కడుపులోని బిడ్డ ఎదుగుదల బాగుంటుంది.
రక్తహీనతని తగ్గిస్తుంది. పెదవులకి రంగునిస్తుంది.. నల్లని పెదవులు అందాన్ని చెడగొట్టేస్తాయి. అందుకే పెదాల సంరక్షణ కూడా అవసరం. ఎర్రటి పెదవులు పొందటం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎర్రగా ఉండే ఈ పండ్ల తొక్కలతో పెదవులు మర్దన చేసుకోవచ్చు. దాని వల్ల నల్లగా ఉండే పెదవులు ఎర్రగా కనిపిస్తాయి. జుట్టుకి మేలు.. జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు సమస్యని నివారిస్తుంది. జుట్టు కుదుళ్లు బలపడేందుకు సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణ.. రోజుకి 3 లేదా 4 పండ్లు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.