మళ్ళీ ఐటీ కార్యాలయానికి నిర్మాత దిల్ రాజు..! ఈ సారి ఏం జరిగిందంటే..?
ఐటీ చెల్లింపుల విషయంలో తేడాలు ఉన్నట్లు అధికారులకు సమాచారం రావడంతో ఐటీ శాఖ ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పుడు ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్లను దిల్ రాజు మంగళవారం సబ్మిట్ చేసినట్టు సమాచారం. అయితే ఈ సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.
వందలాది కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా రూ. 300 కోట్ల కు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు దిల్ రాజు ఇంట్లో దాడులు నిర్వహించారు. సుమారు నాలుగు రోజుల పాటు దిల్ రాజు ఆఫీస్, కుటుంబ సభ్యుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు చాలా సర్వసాధారణమన్నారు.
తమ లావాదేవీలన్నీ క్లీన్‌గా, చాలా క్లియర్‌గా ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ అధికారుల తనిఖీల సమయంలో తమ వద్ద కేవలం రూ.20 లక్షల లోపు మాత్రమే నగదు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలిపారు. 24 క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి సంబంధించిన అన్ని లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలించారన్నారు. సంస్థ నుంచి లభ్యమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని అధికారులు తమకు తెలిపారన్నారు.