News

పొలం కోసం కన్న కొడుకు కర్కశత్వాన్ని బయట పెట్టిన సోషల్ మీడియా.

తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం అని మన గురువులు చెబుతుంటారు. నిజమే జీవితాన్ని ప్రసాదించి, పెంచి పెద్ద చేసి మన కాళ్ల మీద మనం నిలబడేటట్లు చేస్తారు. తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలకు చదువులు చెప్పించి పెంచుతారు. తనకు తినడానికి ఏమిలేకపోయినా తన పిల్లలకు ఉంటే చాలు అనుకునే తల్లిదండ్రులను నిత్యం చూస్తూ ఉంటాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని నీరు గట్టు వారి పల్లె అయోధ్య నగర్ లో వెంకటరమణారెడ్డి, లక్ష్మమ్మ అనే దంపతులు జీవిస్తున్నారు.

వీరి కుమారుడి పేరు శ్రీనివాసులురెడ్డి. అతడికి పెళ్లయింది, పిల్లలు కూడా కలిగారు. భూ పంపిణీకి సంబంధించి శ్రీనివాసులు రెడ్డి, వెంకట రమణారెడ్డి దంపతులకు కొద్దిరోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం శ్రీనివాసులు రెడ్డి తన తల్లిదండ్రులు ఉండే ఇంటికి వచ్చాడు. వచ్చి రాగానే తల్లి లక్ష్మమ్మ మీద దాడి చేశాడు. బూతులు తిడుతూ కడుపులో తన్నాడు. పిడికిలితో భుజంపై కొట్టాడు. అతడు కొట్టిన దెబ్బలకు ఆ తల్లి కింద పడిపోయింది.

ఆ నొప్పులకు తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టింది. వెంకటరమణారెడ్డి వృద్ధుడు కావడంతో.. తన కొడుకును వారించలేకపోయాడు. అతడు అలాగే మంచంలో కూర్చుని భయంతో వణికిపోయాడు. శ్రీనివాసులు రెడ్డి తన తల్లిపై చేసిన దాడికి సంబంధించి చుట్టుపక్కల వారు ఫోన్లో వీడియో తీశారు. ఆ వీడియోను పోలీసులకు ఫార్వర్డ్ చేశారు. దీంతో మదనపల్లి టౌన్ సిఐ యువరాజు ఆ దంపతులను పరామర్శించారు.

దాడికి గల కారణాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం లక్ష్మమ్మ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాగా, ఈ ఘటనతో నీరు గట్టు వారి పల్లె అయోధ్య నగర్ లో కలకలం రేగింది. భూమి పంపిణీకి సంబంధించి కొద్దిరోజులుగా శ్రీనివాసులు రెడ్డి వెంకటరమణ రెడ్డి, లక్ష్మమ్మ దంపతులను వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు కు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు చెబుతున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker