డెర్మాటోమైయోసిటిస్ అంటే ఏమిటి..? ఈ వ్యాధి ఎలాంటి వారికీ వస్తుందో తెలుసా..?
డెర్మటోమయోసైటిస్ అనేది అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధి కారణంగా కండరాలు వాచిపోయి చర్మంపై దద్దుర్లు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మైయోసైటిస్ అంటే కండరాలలో మంట అంటే నొప్పి, వాపు. అంతే కాదు ఈ వ్యాధి కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా మారుతుంది. శరీరం వ్యాధులతో పోరాడలేదు.
ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తే దీనివల్ల వచ్చే సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే డెర్మటోమైయోసిస్ వ్యాధి మొదటి లక్షణం చర్మంపై కనిపిస్తుంది. దీనిలో చర్మం క్రమంగా నల్లబడటం ప్రారంభమవుతుంది. అలాగే దద్దుర్లు రావడం కూడా మొదలవుతుంది.
దీని ప్రభావం ఎక్కువగా కళ్ల చుట్టూ, ముఖంపైనే కనిపిస్తుంది. ఈ దద్దుర్లు, దురద బాధాకరంగా ఉంటాయి. ఈ వ్యాధి వచ్చిన వారు కూర్చోవడానికి, బరువులు ఎత్తడానికి, మెట్లు ఎక్కడానికి, దిగడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏ పనీ చేయకుండానే అలసటగా కూడా అనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల ఎగువ శరీరం కండరాలు క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తాయి. అలాగే సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది.
ఇప్పటివరకు ఈ వ్యాధికి గల కారణాలు సరిగ్గా తెలియదు. కానీ నిపుణుల ప్రకారం.. ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి అని నమ్ముతారు. దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థ తన స్వంత ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. జెనెటిక్స్, కొన్ని రకాల మందులు, వైరస్ ఇన్ఫెక్షన్లు, స్మోకింగ్, ఇతర కారణాలు కూడా ఈ వ్యాధికి కారణమంటున్నారు నిపుణులు.