News

భిక్షాటన చేస్తూ కేవలం 45 రోజుల్లో రూ.2.5లక్షలు సంపాదించిన మహిళ.

అత్యంత దీనంగా బాబు ధర్మం చేయండి అంటూ చేయి చాచిన వారిని చూసి ఎవరికైనా మనసు కరగక మానదు. అ‍య్యో పాపం అనుకుని.. తోచినంత వారికి దానం చేస్తాం. అయితే ఇలా అడుక్కునే వారిలో అందరూ పేదవాళ్లు, నిజంగా అభాగ్యులే ఉంటారా అనుకుంటే బొచ్చెలో కాలేసినట్లే. చూడటానికి వీరు బిచ్చగాళ్లే కానీ.. వీరిలో ఎంత మంది లక్షాధికారులు ఉన్నారో మనకు తెలియదు. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ ఎన్‌జీఓ సంస్థ ఈ యాచకురాలి వ్యవహారాన్ని గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన ఇంద్రాబాయి అనే మహిళకు ఐదుగురు సంతానం.

వీరిలో ముగ్గురిని యాచన వృత్తిలోకి దింపింది. ఈ విషయం తెలుసుకున్న సంస్థ అధ్యక్షురాలు రూపాలీ జైన్‌ పోలీసులకు సమాచారం అందించారు. మహిళ ఇండోర్‌-ఉజ్జయిని రహదారిలోని లువ్-కుశ్‌ కూడలిలో తన ఎనిమిదేళ్ల కుమార్తె, ఇద్దరు కుమారులతో కలిసి భిక్షాటన చేస్తుండగా పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన ముగ్గురు పిల్లలతో 45 రోజుల్లో సంపాదించిన రూ. 2.5 లక్షల్లో ఒక లక్షను అత్తామామలకు పంపానని, 50 వేలు తన బ్యాంకులో ఖాతాలో జమ చేశానని, మరో రూ.50 వేలు తన బిడ్డ పేరు మీద డిపాజిట్‌ చేశానని వెల్లడించింది.

రాజస్థాన్‌లో ఆమెకు పెద్ద భవనంతో పాటు వ్యవసాయ భూమి, బైక్‌ కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. రోజుకు సుమారు రూ.3 వేల వరకు సంపాదిస్తున్నట్లు తెలిపింది. మహిళను కోర్టు ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కాగా ఆమె 8 ఏళ్ల చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించారు. ఇండోర్‌లో యాచకురాలు ఇంద్రాబాయి షెల్టర్‌ను ఏర్పాటు చేసుకుని తన పిల్లలతో నివాసం ఉంటోంది. సంస్థ సభ్యులు ఆమె షెల్టర్‌ వద్దకు చేరుకోగానే ఆమెతోపాటు పిల్లలు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు.

వారిలో ఇద్దరు అబ్బాయిలు తప్పించుకోగా మహిళ, ఎనిమిదేళ్ల చిన్నారిని దొరకబట్టారు. గత ఏడు రోజుల వ్యవధిలోనే ఆమె రూ.19 వేలకుపైగా సంపాదించినట్లు విచారణలో వెల్లడించింది. కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి అలవాటు పడ్డ మహిళ తన ఎనిమిదేళ్ల కుమార్తె, ఇద్దరు కుమారులతో లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నట్లు తెలిసింది. యాచక రహిత సిటీగా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టులో పని చేస్తున్న ప్రవేశ్‌ అనే స్వచ్ఛంద సంస్థ మహిళ బండారాన్ని బయటపెట్టింది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker