భారతరత్న అవార్డు గ్రహీతలకు దేశంలో ఎలాంటి స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా..?
‘భారతరత్న’ అవార్డును 1954 జనవరి 2న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, శాస్త్రవేత్త డాక్టర్ చంద్రశేఖర్ వెంకట రామన్‌లకు తొలిసారిగా 1954లో ఈ గౌరవం లభించింది. అయితే భారతరత్న అనేది దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రకటిస్తారు. అవార్డు ఎలా ఉంటుంది.. భారతరత్న అవార్డును ప్రఖ్యాత కళాకారుడు, పద్మవిభూషణ్ గ్రహీత నందలాల్ బోస్ రూపొందించారు.
కాంస్యంతో తయారు చేసిన ఈ పురస్కారం, రావిచెట్టు ఆకు ఆకారంలో ఉంటుంది. దానికి దానిపై ఒకవైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడి చిత్రం, కింద దేవనాగరి లిపిలో ‘భారతరత్న’ అని రాసి ఉంటుంది. పతకానికి మరోవైపు అశోక స్తంభం, కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. తెల్ల రిబ్బన్‌తో దీన్ని మెడలో వేసుకోవచ్చు. భారతరత్నకు వ్యక్తుల పేర్లను ప్రధాన మంత్రి ఎంపిక చేసి, రాష్ట్రపతికి పంపిస్తారు. రాజకీయాలు, విద్య, సైన్స్, ఆర్ట్స్, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ, శాంతి వంటి వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు అందిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పార్లమెంటు సభ్యులు, ప్రముఖులు వంటి వివిధ వనరుల నుంచి వచ్చిన నామినేషన్ల ఆధారంగా సిఫార్సులు ఉంటాయి. ఇందుకు జాతీయతతో సంబంధం ఉండదు. అందుకే విదేశీయులకు కూడా భారతరత్న ప్రకటించారు. ఇప్పటి వరకు నలుగురు విదేశీ పౌరులు, ఇద్దరు మానవేతరులు సహా మొత్తం 49 మంది వ్యక్తులకు ఈ అవార్డు లభించింది. 15 మందికి మరణానంతరం భారతరత్న ప్రదానం చేశారు.
అయితే అవార్డు గ్రహీతలకు ఎలాంటి నగదు ప్రోత్సాహకాలు ఇవ్వరు. ఒక మెడల్, సర్టిఫికేట్ (సనద్) మాత్రమే అందిస్తారు. భారతరత్న ప్రయోజనాలు.. భారతరత్న గ్రహీతకు కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రయోజనాలు లభిస్తాయి. భారతరత్న అవార్డు గ్రహీతలకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ Z+ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జీతానికి సమానమైన మొత్తాన్ని జీవితకాల పెన్షన్‌గా అందిస్తారు. అధికారిక ప్రోటోకాల్ లిస్ట్‌లో భారతరత్న గ్రహీతలకు స్థానం ఉంటుంది.
ప్రాధాన్యత క్రమంలో వీరికి ఏడవ ర్యాంక్ ఉంటుంది. దేశంలోని ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణాలకు డిస్కౌంట్ ఉంటుంది. భారతరత్న అందుకున్న వారు దేశంలోనే మరణిస్తే, సైనికుల గౌరవ వందనంతో ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తుంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో బోర్డింగ్ విషయంలో ప్రాధాన్యత ఉంటుంది.