సాయంత్రం ఆరు లోపు భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకోండి.
భోజనం చేయడానికి, నిద్రపోవడానికి మధ్య సమయం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లేదంటే మీరు తిన్న ఆహారం జీర్ణం అవడం కష్టమవుతుంది. నిద్రలో పనేమీ ఉండదు కాబట్టి అది జీర్ణం కాదు. అందుకే తిన్నాక కనీసం రెండు నుండి మూడు గంటల సమయం తర్వాతే పడక ఎక్కాలి. అయితే అంతే కాదు.. 30లు దాటితే చాలు.. రకరకాల ఆరోగ్య సమస్యలూ చుట్టుముడుతున్నాయి. ఇందుకు మన జీవన శైలి కూడా కచ్చితంగా ఒక కారణమే. అందుకనే మళ్లీ పాత తరం అలవాట్లను అలవాటు చేసుకోమని వైద్యులు సూచిస్తున్నారు.
కచ్చితంగా సాయంత్రం ఆరు గంటల్లోపు భోజనం పూర్తి చేసేయమంటున్నారు. అందువల్ల చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..నిద్రపోవడానికి రెండు మూడు గంటల ముందుగా భోజనం చేసేయడం వల్ల గుండె పోటు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మనం నిద్రపోయేప్పుడు దాదాపుగా 10 శాతం మేర రక్త పోటు నెమ్మదిస్తుంది.
మళ్లీ మనం ఉదయం లేచినప్పుడు అది పుంజుకుంటుంది. తొందరగా తినడం అనేది రక్త పోటుపైనా ప్రభావం చూపుతుంది. అది నియంత్రణలో ఉండి గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధుమేహం రాదు..నిద్రపోయే ముందు లేదా అర్ధరాత్రిళ్లు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. తొందరగా ఆహారాన్ని తిన్నప్పుడు శరీరం ఇన్సులిన్‌ని ప్రభావవంతంగా ఉపయోగించుకోగలుగుతుంది.
అందువల్ల మధుమేహం ముప్పు తగ్గుతుంది. బరువు తగ్గుతారు..బరువు తగ్గేందుకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు కచ్చితంగా తొందరగా భోజనం చేసేయాలి. ఇది ఇంటర్మిటెన్ పాస్టింగ్‌తో సమానం. అందువల్ల శరీరానికి బయట నుంచి ఎక్కువ సమయం గ్లూకోజ్ లభించదు. దీంతో లోపల నిల్వ ఉన్న కొవ్వుల్ని కరిగించి శక్తిగా మారుస్తుంది. ఫలితంగా ఊబకాయం, అధిక బరువు ఉండటం లాంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం మొదలవుతుంది.
మంచిగా నిద్ర పోతారు..నిద్రపోవడానికి కనీసం మూడు నాలుగు గంటల ముందు భోజనం చేసేస్తారు. కాబట్టి ఈ సమయంలో పొట్టలో ఉన్న ఆహారం జీర్ణం అయిపోతుంది. శరీరం పనిలో ఉంటే సరిగ్గా నిద్రపోలేదు. అది పని లేకుండా ఉన్నప్పుడు మాత్రమే చక్కగా రెస్ట్ తీసుకోగలదు. అందువల్ల నిద్ర బాగా పట్టాలంటే తొందరగా భోజనం చేయాల్సిందే. లేదంటే అజీర్ణం, కలత నిద్ర లాంటి ఇబ్బందులు కలుగుతాయి.