పొట్టిగా ఉండే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువా..? దీంతో జీవితకాలంలో..
మధుమేహం అనేది దీర్ఘకాలిక వైద్య పరిస్థితి, దీనిలో శరీర కణాల ద్వారా శోషించబడే రూపంలో గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేయడానికి ఇన్సులిన్ అనే హార్మోన్‌ను ఉపయోగించలేకపోవడం వల్ల శరీరంలో అధిక స్థాయి గ్లూకోజ్ ఏర్పడుతుంది. గ్లూకోజ్ శరీరానికి ప్రధాన శక్తి వనరు మరియు మనం తినే ఆహారం నుండి విచ్ఛిన్నమవుతుంది. అయితే ఇప్పుడు జర్మనీ చేసిన అధ్యయనంలో మధుమేహం వచ్చే అవకాశం పొట్టిగా ఉండే వారిలో ఎక్కువని తేలింది. ఎత్తుగా ఉండే వారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారు త్వరగా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నట్టు ఆ కొత్త అధ్యయనంలో తెలిసింది. ఎత్తు తక్కువగా ఉన్న మగవారికి 41 శాతం మధుమేహం వచ్చే అవకాశాలు పెరిగితే, ఆడవారికి 33 శాతం వరకు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
మధుమేహానికి, ఎత్తుకు సంబంధం ఏమిటో కూడా వివరిస్తున్నారు. ఎత్తు తక్కువగా ఉండే వారిలో కాలేయం కొవ్వును అధికంగా స్టోర్ చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీరంలో వాపు, జీవక్రియ సంబంధ జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మధుమేహంతో సంబంధం కలిగినవే. కాలేయంలో కొవ్వు పెరిగే కొద్దీ మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. శరీరం చిన్నగా ఉండే వారిలో జీవక్రియల్లో మార్పులు అధికంగా ఉంటాయి. ఆ మార్పుల వల్లే ఇలాంటి రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. పొడవుగా ఉన్న వారిలో కాలేయంలో కొవ్వు స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాలేయంలో కొవ్వు పేరుకు పోవడం అనేది నెమ్మదిగా జరుగుతుంది.
అందుకే అలాంటి వారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతోంది ఈ కొత్త అధ్యయనం. డయాబెటిస్ అనేది ఒక్కసారి వచ్చిందంటే… జీవితాంతం కొనసాగే ఒక అనారోగ్య సమస్య. ఇది ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. ప్రతి ఏటా 10 లక్షల మంది కేవలం ఈ మధుమేహం కారణంగా వచ్చే అనారోగ్యాల వల్లే మరణిస్తున్నారు. రక్త ప్రవాహంలో చక్కెర శాతం పెరిగిపోవడమే ఈ మధుమేహానికి కారణం. ఇది అదుపులో లేకపోతే గుండెపోటు, మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్, కళ్ళు కనిపించకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు పాదాలు, కాళ్లు కూడా తొలగించాల్సి రావచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 42 కోట్ల మందికి పైగా మధుమేహం ఉందని అంచనా. 40 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పుడు నాలుగు రెట్లకు పెరిగింది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లే మధుమేహం బాధితులను పెంచుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మనం తిన్న ఆహారం శరీరంలోకి చేరాక కొంత చక్కెరగా మారుతుంది. దీన్నే గ్లూకోజ్ అని కూడా పిలుస్తారు. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఇది శక్తిగా మార్చే ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో… అప్పుడు చక్కెర శక్తిగా మారకుండా రక్తంలో పేరుకుపోతుంది. ఇదే మధుమేహ వ్యాధికి కారణం అవుతుంది.
మధుమేహంలో టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్ అని మూడు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్ పుట్టుకతోనే వచ్చేది లేదా పిల్లల్లో కనిపించేది. ఇక టైప్ 2 డయాబెటిస్ పెద్దవారిలో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. జెస్టేషనల్ డయాబెటిస్ అనేది గర్భంతో ఉన్న సమయంలో మహిళలకు వచ్చే వ్యాధి. దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం, ప్రత్యేకంగా రాత్రిపూట రెండు కన్నా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం, తీవ్రంగా అలసిపోయినట్టు అనిపించడం, బరువు తగ్గుతూ ఉండడం, నోట్లో పుండ్లు రావడం, చూపు అ స్పష్టంగా మారడం, శరీరం మీద తగిలిన గాయాలు త్వరగా మానకపోవడం… అనేవి డయాబెటిస్ లక్షణాలుగా చెప్పుకుంటారు.