అవాంఛిత రోమాలను షేవింగ్ చేస్తున్నారా..? మీ కోసమే ఈ విషయాలు.
ముఖ వెంట్రుకలు మహిళల రూపాన్ని పాడు చేస్తాయి. ముఖ్యంగా కొంతమంది మహిళలకు ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వారు తమ ముఖం చూపించుకోలేక ఆత్మన్యూనతా భావానికి లోనవుతారు. హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి కారణంగా ఆడవారి ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలలో ఆండ్రోజెన్ హార్మోన్లు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం వల్ల వారి ముఖం, శరీర భాగాలపై అవాంఛిత రోమాలు అభివృద్ధి చెందుతాయి.
అయితే షేవింగ్ లేదా రేజర్ ఉపయోగించడం వల్ల వెంట్రుకలు బిరుసుగా మారుతాయి అనేది కేవలం అపోహ మాత్రమే. అవాంఛిత రోమాలను రేజర్‌తో తొలగించినప్పుడు, ఆ రోమాలు రూట్ తో సహా తొలగిపోవు. దాని మూలం అలాగే చర్మంలో ఉంటుంది. నిజానికి షేవింగ్ అనేది అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి అత్యంత చౌకైన, సులభమైన, నొప్పిలేని మార్గం. అయితే, షేవ్ చేయడం సురక్షితమేనా? చర్మం నల్లగా మారుతుందా? తిరిగి రోమాలు మందంగా పెరుగుతాయా? వంటి ఆందోళనలు మహిళల్లో కలగడం సహజమే. అయితే వాస్తవాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.
షేవ్ చేసినప్పుడు తిరిగి రోమాలు పెరగడంతో చర్మంపై భాగం గరుకుగా మారినట్లు అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు. రేజర్‌ను పదే పదే ఉపయోగించినప్పుడు, వెంటుక మధ్య భాగం మాత్రమే మనం కత్తిరిస్తాం. ఈ కారణంగా రేజర్ ఉపయోగిస్తే మన చర్మం మందంగా మారింది అని భావిస్తుంటాం. షేవ్ చేయకుండా జుట్టు పెరిగిన తర్వాత వ్యాక్స్ వాడినప్పుడు కూడా మీ జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. అందువల్ల, షేవింగ్ లేదా రేజర్ ఉపయోగించడం వల్ల రొమాలు ఒత్తుగా పెరుగుతాయి అనేది అపోహ మాత్రమే.
అలాగే షేవింగ్ వల్ల రోమాలు వేగంగా పెరుగుతాయని అపోహ మాత్రమే. అవాంఛిత రోమాలను తొలగించడానికి షేవింగ్ లేదా రేజర్ని ఉపయోగించినప్పుడు, ఒకటి లేదా రెండు రోజుల తర్వాత మీరు చర్మంలో కరుకుదనం, దురద సమస్యను ఎదుర్కోవచ్చు. ఈ సమస్యను నియంత్రించడానికి చర్మంపై మాయిశ్చరైజర్ ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు, ఆ ప్రాంతాన్ని ఆవ నూనె, కొబ్బరి నూనెతో మసాజ్ చేయండి లేదా పడుకునే ముందు బాడీ లోషన్ రాయండి.
ఇలా చేయడం వల్ల చర్మం త్వరగా నయమై జుట్టు మృదువుగా ఉంటుంది. ఆల్కహాల్ ఉన్న ఉత్పత్తులను షేవింగ్ తర్వాత చర్మంపై రాయకూడదని గుర్తుంచుకోండి. ఫంగస్ లేదా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలను తగ్గించడానికి రేజర్‌ను శుభ్రమైన, పొడి ప్రదేశంలో ఉంచండి. నిజానికి షేవింగ్ చేయడం వల్ల మీ చర్మం నల్లగా మారదు. వ్యాక్సింగ్ లేదా కెమికల్ ఉత్పత్తులను ఉపయోగించడంతో పోలిస్తే మీ శరీరంలోని అవాంఛిత రోమాలను వదిలించుకోవడానికి షేవింగ్ ఒక సురక్షితమైన మార్గం అని చెప్పవచ్చు.