కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..? ఆ సమయంలో కూడా..?
కొబ్బరి నీళ్లను ఉదయాన్నే పరిగడుపున తాగడం వల్ల చలవ చేస్తుంది. ఎక్కువగా వేడి చేసినట్లు ఉన్నట్లయితే ఇలా పొద్దున్నే తాగడం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి స్వాంతన లభిస్తుంది. అలాగే ఈ నీటిలో కేలరీలు తక్కువ. తేలికగా జీర్ణం అవుతాయి. భోజనం చేసిన కాసేపటి తర్వాత వీటిని తాగినట్లైతే తిన్న ఆహారం మెరుగ్గా జీర్ణం అవుతుంది. అందుకు ఈ నీరు సహకరిస్తుంది. పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అయితే ”ప్రతి రోజూ ఉదయం 10 గంటల సమయంలో ఒక గ్లాసు కొబ్బరి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడంలో సాయపడుతుంది.
చర్మం తేమ నియంత్రణలో ఉండడమే కాకుండా బ్యాక్టీరియా సంబంధ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తి చర్మానికి లభిస్తుంది” అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇదే నిజం కాబోలు అని అంతా అనుకుంటున్నారు. దీనిపై ఆరోగ్య నిపుణులు స్పందించారు. “కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 45 కేలరీలు మాత్రమే ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వారికి, బరువుని అదుపులో ఉంచుకోవాలని అనుకునే వారికి ఇదొక మంచి పానియం. సోడా లేదా షుగర్ డ్రింక్స్ తీసుకోవడానికి బదులుగా కొబ్బరి నీళ్లు తీసుకోవడం శ్రేష్టం” అని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
“కొబ్బరి నీళ్లను సాయంత్రం పూట తాగడం కంటే పొద్దునే తాగడం మంచిది. అయితే మితంగానే తీసుకోవాలి. కొబ్బరి నీరు రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు, శరీర జీవక్రియలకు అవసరమైన ఉత్తేజాన్ని అందిస్తుంది. కొబ్బరి నీరు ఒక అద్భుతమైన సహజ ఎలక్ట్రోలైట్ మూలం. వ్యాయామం తర్వాత రీహైడ్రేషన్ కోసం ఇది మంచి ఎంపిక” అని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అయితే, కొబ్బరి నీరు అందరికీ మంచిదేనా? ఎలాంటి వ్యక్తులు అయినా తాగొచ్చా? అంటే కాదని అంటున్నారు వైద్య నిపుణులు.
కొంతమంది వ్యక్తులకు కొబ్బరి నీరు మంచిది కాదన్నారు. రక్తంలో అధిక మోతాదులో పొటాషియం నిల్వలు ఉన్న వారు కొబ్బరి నీరుకు దూరంగా ఉండడమే మంచిది. అలాగే కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు, గుండె స్పందన సమస్యలు ఎదుర్కొంటున్న వారు కొబ్బరి నీరు తాగరాదు” అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. ”కొందరు వ్యక్తులు నిద్రకు ముందు ఓదార్పు, హైడ్రేటింగ్ కోసం కొబ్బరి నీరు తాగుతారు. ఇది కరెక్ట్ కాదు. మీ ప్రాధాన్యతలను, కొబ్బరి నీరు మీ నిద్రను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? అన్న విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వ్యక్తులను బట్టి వారి ప్రాధాన్యతలు, దిన చర్యలు మారుతూ ఉంటాయి.
కాబట్టి మీ శరీర అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా కొబ్బరి నీళ్లను తీసుకోవడం మంచిది” అని వైద్య నిపుణులు సూచించారు. అదే సమయంలో ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. కొబ్బరి నీరు ఆరోగ్యకరమైన ఎంపికే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే, అందరూ కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. కొబ్బరి నీరులో సహజంగా చక్కెర ఉంటుంది. కనుక మితంగా తీసుకోవడం చాలా కీలకం అని వైద్య నిపుణులు వివరించారు.