కార్డియాక్ అరెస్ట్ వచ్చే ముందు కనిపించే సంకేతాలు, ప్రాణాపాయం ఎలా తప్పించవచ్చు.
సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది సక్రమంగా లేని గుండె లయ కారణంగా తలెత్తే ఒక ప్రాణాంతక పరిస్థితి. కార్డియాక్ అరెస్ట్ అయినపుడు గుండె కార్యకలాపాలన్నీ ఆకస్మికంగా నిలిచిపోతాయి, శ్వాస ఆగిపోతుంది. వ్యక్తి స్పృహ కోల్పోతాడు, తక్షణమే స్పందించి వీలైనంత త్వరగా చికిత్స చేయకపోతే అది వ్యక్తి మరణానికి దారి తీస్తుంది. అయితే గుండె సమస్యలు ఇటీవలి కాలంలో ఎక్కువైపోతున్నాయి. గుండె సమస్యలను ముందుగానే గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారతాయి.
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల ప్రభావంతో చిన్న వయస్సు వారిలోనే గుండెకు సంబంధించిన సమస్యలు వెలుగు చూస్తున్నాయి. గుండెకు సంబంధించిన సమస్యల్లో ప్రమాదకరమైనది కార్డియాక్ అరెస్ట్. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ కు సంబంధించి ముందస్తుగా వచ్చే లక్షణాలను , సంకేతాలను గుర్తించి చికిత్స పొందితే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి.. కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె పనితీరు, శ్వాస, స్పృహ ఆకస్మికంగా కోల్పోవటాన్ని సూచిస్తుంది.
అప్పుడప్పుడు గుండె యొక్క విద్యుత్ వ్యవస్థలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని అరిథ్మియాగా పిలుస్తారు. హృదయ స్పందన హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. కార్డియాక్ అరెస్ట్ ముందస్తు సంకేతాలను గుర్తించడం.. కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసే సంకేతాలను ముందుగా గుర్తించడం వల్ల మరణముప్పునుండి తప్పించుకోవచ్చు. హెచ్చరిక సంకేతాలకు సంబంధించి ఛాతీలో అసౌకర్యం, నొప్పి, శ్వాస ఆడకపోవడం, దడ, మైకము, అలసట, మూర్ఛ , వికారం వంటి లక్షణాలు కార్డియాక్ అరెస్ట్‌కు ముందుగా కనిపిస్తాయి. కొన్ని సమయాల్లో, ఎటువంటి హెచ్చరిక లేకుండా గుండె పనితీరు నిలిచిపోవచ్చు.
సకాలంలో స్పందించటం.. కార్డియాక్ అరెస్ట్ అన్నది క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు పోయేలా చేస్తుంది. దీని విషయంలో సకాలంలో స్పందించటం అన్నది చాలా ముఖ్యం. ఒక వ్యక్తి గుండెకు సంబంధించి ఇబ్బందికరమైన లక్షణాలను కలిగి ఉంటే వెంటనే వారికి వైద్య సహాయం అందించటం మంచిది. ఇందుకోసం వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రి తరలించటం వంటివి అత్యవసరంగా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ప్రాణాలు పోకుండా కాపడేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
కార్డియాక్ అరెస్ట్‌ను నివారించటానికి.. కార్డియాక్ అరెస్ట్‌ను నివారించాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చూసుకోవటం, ధూమపానం మానేయడం, ఒత్తిడిని లేకుండా చూసుకోవటం వంటి గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
ఇప్పటికే గుండె జబ్బులు కలిగిన వారు రెగ్యులర్ చెక్-అప్‌లలతో వైద్యులు సూచించిన మందులు వాడుకోవటం మంచిది. కార్డియాక్ అరెస్ట్‌కు దారితీసే లక్షణాలపై అవగాహన కలిగి ఉండటం అన్నది ప్రమాదాన్ని ముందే పసిగట్టేందుకు అవకాశం ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో కీలకమైన మొదటి అడుగుగా దీనిని చెప్పవచ్చు. గుండె ఆరోగ్యానికి మంచి జీవనశైలిని అనుసరించటంతోపాటు, లక్షణాలు కనిపించినప్పుడు సకాలంలో వైద్యసహాయం తీసుకోవటం ద్వారా మరణాల రేటును తగ్గించవచ్చు.