అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బ్రెయిన్ స్టోక్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా..?
ఆహారపు అలవాట్లు, జీవన శైలి, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఊబకాయం, కిడ్నీ సమస్య, హార్మోన్లలో మార్పులు, ఉప్పు ఎక్కువగా తినడం, వంశ పారంపర్య లక్షణం లాంటి అనేక కారణాలతో హై బీపీ వస్తుంది. రక్తపోటు అనేక అంశాలమీద ఆధారపడి మారుతూ ఉంటుంది . ఇది 140/90 కంటే ఎక్కువైతే అధిక రక్తపోటు హై ప్రజర్ గాను , 90/60 కంటే తక్కువైతే అల్ప రక్తపోటు లో ప్రజర్ గాను పిలుస్తారు. ఈ రెండు ప్రమాదకరమైనవే. అయితే హైపర్‌టెన్షన్ బారినపడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో రోజురోజుకూ పెరుగుతోంది. ప్రారంభంలో తమకు బీపీ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియదు.
తలనొప్పి, జ్వరం, దగ్గు శరీరపు నొప్పులతో వచ్చే వారికి బీపీ పరీక్షలు చేస్తే అధిక రక్తపోటు ఉన్న విషయం బయట పడుతుంది. ఒకప్పుడు 35 సంవత్సరాల పైబడిన వారిలో అధిక రక్తపోటు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ప్రస్తుతం 20 సంవత్సరాల వయస్సు వారు సైతం హైపర్ టెన్షన్ తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అధికరక్తపోటుకు ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానాలు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవటం ప్రానెస్ ఫుడ్, పీజ్జాలు, బర్గర్లు, రెడీమేడ్ మాంసం, కూల్‌డ్రింక్‌లు, ప్రిజ్‌లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తినేవారిలో అధిక రక్తపోటు సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.
పని ఒత్తిడి సైతం బీపీ సమస్యలు రావటానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అధికరక్తపోటు గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. అలాగే పక్షవాతంతో పాటు కిడ్నీసమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్టోక్ గుండె సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. రక్తపోటు వల్ల కిడ్నీ రక్తనాళంలో అడ్డంకులు ఏర్పడి కిడ్నీ దెబ్బతినే ప్రమాదముంది. అలాగే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పొంచి ఉంటుంది. నిద్రించే సమయంలో బీపీ హెచ్చుతగ్గులకు లోనైతే కొన్ని సందర్భాల్లో ప్రాణానికి ముప్పుగా మారుతుంది.
కొందరిలో ఉదయం సమయంలో ఉన్నస్ధాయిలో రాత్రి పూట బీపీ ఉండదు. రాత్రి బీపీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్ధితుల్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ సమస్యకు గురికావాల్సి వస్తుంది. బీపీ సమస్య ఉన్నవారు ఎప్పటికప్పుడు బీపీ ని చెక్ చేసుకుంటూ ఉండటం మంచిది. అధిక రక్తపోటు గుండె సమస్యలు..కరోనరీ ఆర్టరీ వ్యాధి :- అధిక రక్తపోటు వల్ల ధమనులు ఇరుకుగా మారి దెబ్బతింటాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. గుండెకు తక్కువ రక్త ప్రసరణతో ఛాతీ నొప్పి , గుండె లయలు (అరిథ్మియాస్) సరిగా లేకపోవటం, గుండెపోటుకు దారితీస్తుంది.
ఎడమ గుండె ఎనలార్జీ కావటం:- అధిక రక్తపోటు వల్ల శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తాన్ని పంప్ చేయడానికి గుండె కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల దిగువ ఎడమ గుండె గది (ఎడమ జఠరిక) గట్టిగా మారుతుంది. దీనివల్ల ఎడమ జఠరిక గుండెపోటు, గుండె వైఫల్యం,ఆకస్మిక మరణానికి దారితీస్తుంది. గుండె ఆగిపోవటం:- కాలక్రమేణా, అధిక రక్తపోటు వల్ల గుండెపై ఒత్తిడి పడుతుంది. గుండె కండరాలు బలహీనపడతాయి. సమర్థవంతంగా పనిచేయలేని పరిస్ధితి ఏర్పడుతుంది. చివరికి అది గుండె పనితీరు ఆగిపోవటానికి దారితీస్తుంది.