తన కులం కాకపోయినా కూతురు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే.
ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తన కూతురు పల్లవికి కులాంతర వివాహం జరిపించారు. ఆ యువతి ప్రేమించిన పవన్ అనే యువకుడితో సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో ఈ పెళ్లి చేశారు. అయితే ఆమె ఎమ్మెల్యే కూతురు.. అతను ఓ సామాన్యుడు. అయినప్పటికీ ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు.
మరి ఓ సామాన్యుడితో.. అది కూడా వెనుకబడిన కులం వాడితో ఎమ్మెల్యే తన బిడ్డకు వివాహం జరిపించకపోవచ్చు అని అందరూ ఊహించారు. కానీ ఆ ఊహాకు విరుద్ధంగా ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. ప్రేమించిన యువకుడితో తన కూతురికి దగ్గరుండి ఘనంగా వివాహం జరిపించారు ఆ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గొప్ప మనసుపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మొదటి కుమార్తె పల్లవి.. పవన్ అనే యువకుడిని ప్రేమించింది. పవన్‌ను పెళ్లి చేసుకుంటానని పల్లవి తన తండ్రికి చెప్పింది. తండ్రి ఎలాంటి ఆగ్రహానికి గురికాకుండా.. పల్లవి ప్రతిపాదనను అంగీకరించారు. కుమార్తె ఇష్టప్రకారం, సంప్రదాయబద్ధంగా బొల్లవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిపించారు.
ఈ సందర్భంగా నూతన వధూవరులను ఎమ్మెల్యే ఆశీర్వదించారు. అనంతరం ప్రొద్దూటూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తమ పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. తన కుమార్తె ఇష్ట ప్రకారం వారిని ఆశీర్వదించి, ప్రేమ వివాహం జరిపించానని తెలిపారు.
కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడటంతో పవన్‌తో పెళ్లి చేశామన్నారు. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్టప్రకారమే అంగీకరించి, వివాహం ఘనంగా నిర్వహించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.