దేశంలో భారీగా పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు, వెలుగులోకి షాకింగ్ విషయాలు.
తినే ఆహారం, జీవన విధానంలో మార్పులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగంలో ఉత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల మానవుడు ఆరోగ్యం బారిన పడుతున్నాడు. మన ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది. జీవన విధానంలో మార్పుల చేసుకుంటే సుఖమయమైన జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక జీవన శైలి కారణంగా అనారోగ్య సమస్యలు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి.
ముఖ్యంగా బీపీ, షుగర్‌లు బారిన పడేవారు చాలా మందే ఉన్నారు. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. అయితే తాజాగా ది లాన్సెట్ డయాబెటిక్ అండ్ ఎండోక్రైనాలజీ జర్నల్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశ జనాభాలో 11.4 శాతం మంది షుగర్ తో బాధపడుతున్నారు. 35.5 శాతం మంది అధిక రక్తపోటు(హైబీపీ)తో బాధపడుతున్నట్లు నివేదించింది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ కలిసి ఈ అధ్యయాన్ని నిర్వహించాయి. అన్ని రాష్ట్రాల్లోని భౌగోళిక పరిస్థితులు, జనాభా, సామాజిక-ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని దశలవారీగా పరిశోధకులు అధ్యయనం చేశారు. 2008-2020 మధ్యకాలంలో దేశంలోని 1.1 లక్షల మందిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రజల్లో బీపీ, షుగర్ వ్యాధులు పెరుగుతున్నట్లు తేటతెల్లం అయింది.
దేశ జనాభాలో 15.3 శాతం ప్రజలు ప్రి-డయాబెటిస్( షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉన్న పరిస్థితి) స్థితికి చేరారని, 28.6 శాతం మంది ప్రజలు సాధారణ ఊబకాయంతో బాధపడుతున్నారని, 39.5 శాతం ప్రజలు ఉదర సంబంధిత ఊబకాయంతో బాధపడుతున్నట్లు నివేదిక పేర్కొంది. 81.2 శాతం ప్రజల్లో డిస్‌లిపిడేమియా( లిపిడ్స్ లో అసమతుల్యత) ఉందని నివేదికలో వెల్లడైంది.
దేశంలో షుగర్, ఇతర సంక్రమిత వ్యాధుల బాధితుల సంఖ్య గతంలో అంచనా వేసిన దానికన్నా ఎక్కువగా ఉందని, అభివృద్ధి చెందిన రాస్ట్రాల్లో ఈ సంఖ్య స్థిరంగా ఉన్నా.. చాలా రాష్ట్రాల్లో పెరుగుతున్నట్లు సర్వే పేర్కొంది. ఈ ఆరోగ్య సమస్యలు ప్రమాదకరస్థాయికి చేరుతున్నందున వెంటనే అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.