నిద్రలేమి వల్ల ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?
రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరమని చెపుతున్నారు. అప్పుడే శరీరానికి తగిన విశ్రాంతి లభిస్తుందని వివరించారు. మెలకువగా ఉన్నపుడు అలసిపోయిన శరీర అవయవాలు నిద్రలో తిరిగి శక్తిని ఆర్జిస్తాయని వివరించారు. మెదడు చురుకుగా మారుతుందని చెప్పారు. నిద్రలేమి వల్ల దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు. అయితే నిద్ర తక్కువ అయితే రోజంతా బడలికగా, కళ్ళు మంటలు పుడుతూ నీరసంగా ఉంటారు.
ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం ఎంత ముఖ్యమో.. రాత్రి నిద్ర కూడా అంతే ముఖ్యం. రాత్రి నిద్రతో పోల్చుకుంటే పగటి నిద్ర ప్రభావం వేరుగా ఉంటుంది. మీరు నిద్రలేమితో బాధపడుతుంటే వ్యాధులు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల శరీరం బాగా విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. నిద్ర లేమి వల్ల రోగనిరోధక శక్తి, నాడీ వ్యవస్థ, శరీర అవయవాల పనితీరు గాడి తప్పుతాయి. నిద్ర వల్ల కలిగే లాభాలు.. కణాల పునరుద్ధరణకు నిద్ర చాలా సహాయపడుతుంది.
మనం నిద్రపోతున్నప్పుడు శరీరంలోని కణాలు మరియు కండరాలు తమను తాము రిపేర్ చేసుకుంటాయి. కణాల పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. కణజాలాలను నిర్మించి మరమ్మత్తు చేయడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచేందుకు నిద్ర సహాయపడుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం సైటోకిన్ లను విడుదల చేస్తుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్లు, వైరస్ లతో పోరాడేందుకు సహకరిస్తుంది.
మనం కనుక సరిగా నిద్రపోకపోతే సైటోకిన్ విడుదల సక్రమంగా జరగదు. ఫలితంగా మనం అనారోగ్యానికి గురికావలసి వస్తుంది. నిద్రలేమి వల్ల నష్టాలు.. నిద్ర లేకపోతే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది… డిప్రెషన్, అల్జీమర్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఆలోచనవిధానం మందగిస్తుంది. సరిపడినంత నిద్ర లేకపోతే ఊబకాయం, అధిక బరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
నిద్ర లేమి వల్ల ఆకలి పెరుగుతుంది. దీని వల్ల ఎక్కువ కేలరీలు తీసుకునే ప్రమాదం ఉంది. నిద్ర గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సరిగా నిద్రపోకపోతే రక్తపోటు స్థాయిలు పెరిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.