నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలు చేడిపోతయా..? వైద్యులు ఏం చెప్పారంటే..?
మనిషి శరీరంలో కిడ్నీలు ఎంతో ముఖ్యమైనవి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్ర పిండాలు శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. ఆరోగ్యంగా జీవించాలంటే కిడ్నీలు మెరుగ్గా పనిచేయడం ఎంతో అవసరం. అయితే శరీరంలోని ప్రతి భాగం సరిగ్గా పనిచేయడానికి నీరు అవసరం. ఇది మన శరీర బరువులో 60-70 శాతం మధ్య ఉంటుంది. రక్తనాళాలు రక్తాన్ని మూత్రపిండాలకు చేరవేస్తాయి. పోషకాలని అందిస్తుంది. శరీరంలో నీరు తగ్గి డీహైడ్రేషన్ కి గురైతే ముందుగా ఇబ్బంది పడేది మూత్రపిండాలే.
చెమటోడ్చి పనులు చేస్తున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, వేడి తేమతో కూడిన వాతావరణంలో ఉన్నప్పుడు శరీరం ఎక్కువగా నిర్జలీకరణానికి గురవుతుంది. దాని ప్రభావం కిడ్నీల మీద పడుతుంది. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే తగినంత ద్రవాలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 8 గ్లాసుల్ నీరు తాగడం తప్పనిసరి. శరీరం నిరంతరం నీటిని కోల్పోతూనే ఉంటుంది. అందుకే తగినంత నీరు తీసువవడం చాలా ముఖ్యం. ఒకవేళ మూత్రపిండాలు విఫలమైతే సదరు వ్యక్తులు నీటిని విసర్జించలేరు. మూత్రం ముదురు పసుపు రంగులోకి మారుతుంది. అంటే మీ శరీరం డీహైడ్రేషన్ కి గురయ్యిందని సంకేతం.
మారథాన్ రన్నర్, క్రీడాకారులు పెద్ద మొత్తంలో నీటిని కోల్పోతారు. ఇది వారి రక్తంలో ఉప్పుని తగ్గిస్తుంది. హైపోనట్రేమియా అనే తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. కిడ్నీలో రాళ్ళు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వ్యాధులు మూత్రపిండాలకు హాని కలిగించే రెండు సమస్యలు. వీటిని ఎదుర్కోవాలంటే శరీరం హైడ్రేషన్ గా ఉండాలి. తగినంత నీరు లేకపోతే మూత్రపిండాల్లో రాళ్ళు తరచుగా ఏర్పడతాయి. ఇక యూరినరీ ఇన్ఫెక్షన్ నుంచి బయట పడేందుకు మందులు ఉపయోగించాలి. వాటి వల్ల ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాయ మూత్రం ద్వారా బయటకి పోతుంది.
శరీరానికి నీరు చాలా అవసరం కదా అని అధిక మొత్తంలో తీసుకున్నా కూడా దాని ప్రభావం కిడ్నీల మీదే పడుతుంది. మార్చి 9 ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా మూత్ర పిండాల ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. శరీరానికి అవసరమైన నీటి పరిమాణం ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా ఉంటుంది. వయస్సు, వాతావరణం, వ్యాయామం, బ్రెస్ట్ ఫీడింగ్, అనారోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. నీటిని ఎక్కువగా తీసుకుంటే ఓవర్ హైడ్రేషన్ అవుతుంది. నీరు అతిగా తాగితే ఏమవుతుంది.. అవసరానికి మించి నీటిని తీసుకుంటే విషపూరిత ప్రభావాలు చూపిస్తుంది. మెదడు పనితీరుకి అంతరాయాన్ని ఏర్పరుస్తుంది. మెదడు కణాలు ఉబ్బుతాయి. అప్పుడు మెదడులో ఒత్తిడి పెరుగుతుంది.
గందరగోళం, మగత, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ నీరు తాగుతున్నారని చెప్పే సంకేతాలు.. పదే పదే టాయిలెట్‌కు వెళ్తుంటే మీరు అతిగా నీటిని తీసుకుంటున్నారని అర్థం. మూత్రం రంగులో కూడా మార్పు వస్తుంది. దాహం లేకపోయినా బలవంతంగా నీరు తాగితే మత్తుగా అనిపిస్తుంది. మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు ద్రవాలు తొలగించలేనప్పుడు నిర్జలీకరణ లక్షణాలను చూపిస్తుంది. దీని వల్ల వికారం, వాంతులు వస్తాయి. ఒక వ్యక్తి కనీసం రోజుకి 2-3 లీటర్ల నీటిని తీసుకోవాలి. క్రీడాకారులు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలకు ఈ లెక్క వేరే విధంగా ఉంటుంది. వైద్యుల సలహా మేరకు వాళ్ళు నీరు తీసుకోవాలి.