Health

ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టడం లేదా..? అయితే ఈ విషయాలు మీ కోసమే.

సంతానలేమి సమస్యలకి స్త్రీ, పురుషుల్లో ఎవరైనా కావొచ్చు. అయితే.. చాలా సందర్భాల్లో స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ కారణంగానే ఈ సమస్య ఎదురవుతుంటుంది. అలాంటివారు ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, వ్యాయామం, కొన్ని ఆహారపదార్థాలను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. అయితే అండాశయం నుంచి అండం విడుదలయ్యే సమయాన్ని ‘ఒవులేషన్’ అని అంటారు. ఈ ప్రక్రియ జరగడానికి ఎనిమిది రోజుల ముందు మహిళలు గర్బం దాల్చే అవకాశం ఉంటుంది.

అందుకే ఆ సమయాన్ని కచ్చితంగా అంచనా వేయగలగాలి. రుతుక్రమ ప్రక్రియ మొదలైన 8వ రోజు నుంచి 18వ రోజు వరకు శృంగారంలో పాల్గోంటే గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సమయంలో రోజు విడిచి రోజు శృంగారంలో పాల్గొంటే సత్ఫలితాలు కనిపిస్తాయి. అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలో అండం విడుదలైన తర్వాత 12 నుంచి 24 గంటల వరకు మాత్రమే ఫలవంతంగా ఉంటుంది. అలాగే మహిళ జననేంద్రియంలో పురుషుడు స్కలించే వీర్యం ఆమెలో సుమారు ఐదు రోజులు జీవిస్తుంది. కాబట్టి.. ఆ సమయంలో అండం ఎప్పుడు విడుదలైన గర్భధారణ జరుగుతుంది. బరువు కూడా సంతాన అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మహిళలు బరువు విపరీతంగా పెరిగినా, బాగా తగ్గినా సంతాన అవకాశాలు సన్నగిల్లుతాయి. కాబట్టి.. మహిళలు తప్పకుండా తమ ఫిట్‌నెస్ మీద దృష్టిపెట్టాలి. ఫలితంగా పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బాగా బరువు తగ్గే మహిళలు గర్భం దాల్చేందుకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. 2020లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. చైనాలో సంతానం కోసం ప్రయత్నిస్తున్న సుమారు 50 వేల జంటల నుంచి డేటాను సేకరించారు. వారిలో బీఎంఐ ఎక్కువగా ఉండేవారిలో సంతాన సాఫల్య అవకాశాలు తగ్గిపోయాయినట్లు కనుగొన్నారు. గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తున్న మహిళలు ప్రినేటల్ విటమిన్ తీసుకోవడం ప్రారంభించాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

శిశువు మెదడు, వెన్నెముకలో పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి అవసరమైన విటమిన్-బి, ఫోలిక్ యాసిడ్ రోజుకు కనీసం 400 మైక్రోగ్రాములు (mcg) తీసుకోవాలని చెబుతున్నారు. వీటిని ఉపయోగించడానికి ముందు మీరు తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి. గర్భధారణపై వయస్సు కూడా ప్రభావం చూపుతుంది. 35 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఎలాంటి సమస్యలు లేకుండా సంతానం పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ, 35 ఏళ్లు దాటిన తర్వాత సంతాన సమస్యలు తలెత్తితే మాత్రం తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. మహిళల వయస్సు పెరిగే కొద్ది గర్భధారణ అవకాశాలు సన్నగిల్లుతాయి. అలాగే అండాల సంఖ్య, వాటి నాణ్యత కూడా తగ్గిపోతుంది.

ఆ సమయంలో గర్భం దాల్చినట్లయితే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. మహిళల్లో 30 ఏళ్ల వయస్సు నుంచే ఈ సమస్య మొదలవుతుంది. 37 ఏళ్ల వయస్సు నుంచి మరింత తీవ్రమవుతుంది. 40 ఏళ్ల తర్వాత సంతాన అవకాశాలు దాదాపు తగ్గిపోతాయి. గర్భం దాల్చాలంటే.. స్త్రీ, పురుషులిద్దరూ స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. సిగరెట్లలో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి రసాయనాలు అండోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మహిళలు పొగతాగేవారికి సైతం దూరంగా ఉండాలి. ఎందుకంటే.. సిగరెట్ వాసన చూసినా ప్రమాదమే. మాదక ద్రవ్యాలు, మద్యం అలవాట్లకు కూడా దూరంగా ఉండాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker