బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే, ఆ తల్లిబిడ్డకూ ఎంత ప్రమాదమో తెలుసా..?
ప్రసవం తరువాత మొట్టమొదట వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. సాధారణ ప్రసవం అయితే పుట్టిన అరగంట లోపు, సిజేరియన్ ద్వారా ప్రసవమైతే కనీసం నాలుగు గంటలలోపైనా బిడ్డకు తప్పనిసరిగా పాలు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. బిడ్డ పుట్టిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలోనే చురుగ్గా ఉంటారు. కాబట్టి పాలు తాగడానికి ప్రయత్నం చేయగలుగుతారు.
మొదటి పాలివ్వడానికి ఇది కీలక సమయం. పాలు ఇవ్వడం ఆలస్యం అయిన కొద్దీ పాలు రావడం కూడా తగ్గుతుంది. అయితే కొంతమంది తల్లలు తమ అందం దెబ్బతింటుందనే కారణంతో శిశువులకు తల్లిపాలను ఇవ్వకుండా ఆపేస్తారు. ఫలితంగా భవిష్యత్తులో పిల్లలకు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పసిబిడ్డకు కనీసం 8 నెలలు పాలివ్వాలి. కొంతమంది పిల్లలు సుమారు రెండేళ్ల వయస్సుకు కూడా పాలు తాగుతారు. అలా తాగడం వల్ల తల్లికి, బిడ్డకు లాభమే గానీ ఎలాంటి నష్టం ఉండబోదు.
కాబట్టి నిరభ్యంతరంగా శిశువులకు పాలివచ్చు. అందం కోసం ఆలోచించి శిశువు ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమో తల్లులు ఆలోచించాలి. తల్లిపాలు లోపించడం వల్ల శిశువులు ఆకస్మిక మరణానికి గురయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా కొంతమంది పిల్లలకు ఆకస్మిక శిశు మరణ లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల శిశువు ఆకస్మికంగా చనిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఎదుర్కొనే శక్తి కేవలం తల్లిపాలకు మాత్రమే ఉంటుంది.
బిడ్డ ఎదుగుదలకు కావల్సిన అన్నిరకాల పోషకాలను కేవలం తల్లిపాలు మాత్రమే అందించగలవు. తల్లిపాలు తాగే పిల్లల్లో రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. అంతేగాక దృష్టి లోపాలు కూడా దరిచేరవు. తల్లిపాల వల్ల శిశుకు కడుపు నిండి బాగా నిద్రపోతాడు. ఎలాంటి జీర్ణ సమస్యలు కూడా ఉండవు. అంతేకాదు.. తల్లిపాలు పిల్లల్లో క్యాన్సర్‌తోపాటు లింఫోబ్లాస్టిక్ లుకేమియా, హాడ్కిన్స్ తదితర వ్యాధుల నుంచి కూడా రక్షిస్తుంది. తల్లిపాల వల్ల పిల్లలకు తగిన కాల్షియం లభిస్తుంది.
కాబట్టి ఎముకలు, దంత సమస్యలు దరిచేరవు. శిశువుకు పాలివ్వడం వల్ల తల్లులకు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. పాలిచ్చే తల్లులు టైప్-2 డయాబెటీస్ సమస్య నుంచి బయటపడవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. పాలివ్వడం వల్ల కొంతమంది మహిళలు బరువు కూడా తగ్గుతారని పరిశోధకులు తెలుపుతున్నారు. ప్రసవం తర్వాత కలిగే సమస్యలను కూడా పాలివ్వడం ద్వారా నివారించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చనుబాలివ్వడం శిశువుకు మాత్రమే కాకుండా తల్లికి కూడా మేలు చేస్తుందని స్పష్టం చేసింది.