వైట్ రైస్ ఎక్కువగా తింటే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందా..?
అన్నం ఎక్కువగా తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఆహారంలో ప్రధానంగా వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు ఉండాలి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి మంచిది. వైట్ రైస్ తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అయితే శుద్ధి చేసిన ధాన్యాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల ప్రీ మెచ్యూర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ (పిసిఎడి) ప్రమాదం పెరుగుతుందని ఓ అధ్యయనం తేల్చేసింది. శుద్ధి చేసిన ధాన్యం వినియోగంతో 55 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులు,
65 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళల్లో కరోనరీ ధమని సన్నగా మారుతుందని అధ్యయనం తెలిపింది. అంటే గుండెకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనులు పల్చగా మారడం ప్రారంభమవుతాయన్న మాట. దీనివల్లే కొరోనరీ ఆర్టరీ వ్యాధి బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే తృణధాన్యాలు తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని American College of Cardiology (ACC) తన అధ్యయనంలో కనుగొంది. అధ్యయనంలో శుద్ధి చేసిన, తృణధాన్యాలు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వెల్లడైంది. పిసిఎడి అనేది మొదట్లో ఎలాంటి లక్షణాలను చూపించని ప్రమాదకరమైన వ్యాధి.
అయితే దీనివల్ల కాలం గడుస్తున్న కొద్దీ ఛాతిలో నొప్పి మొదలవుతుంది. అయితే ధమనుల్లో కొవ్వు పేరుకుపోయినప్పుడు అది సన్నగా మారుతుంది. దీనివల్లే పిసిఎడి సంభవిస్తుంది. దీనినే స్టెనోసిస్ అంటారు. ఈ వ్యాధి ఎక్కువైతే గుండెపోటు వస్తుంది. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం ఉన్నవారికి అకాల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది తృణధాన్యాల కంటే శుద్ధి చేసిన ధాన్యాలనే తినడానికి ఇష్టపడుతున్నారు. ఆర్థిక స్థితి, ఆదాయం, ఉపాధి, విద్య, సంస్కృతి, వయస్సు, వంటి ఎన్నో దీనికి కారణాలుగా చెప్పొచ్చు.
శుద్ధి చేసిన ధాన్యాలనే కాదు శుద్ది చేసిన చక్కెరను, నూనెను తీసుకోవడం కూడా ప్రమాదకరమే. తృణధాన్యాలను ఇంటి వద్దే లేదా కొన్ని యంత్రాలను ఉపయోగించి తయారుచేస్తారు. అదే ప్రాసెస్ చేసే ధాన్యాలను పెద్ద పెద్ద మిల్లులకు తీసుకెళతారు. ఈ ధాన్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు వాటికి కెమికల్స్ ను కలుపుతారు. దీనివల్ల ఇవి కంటికి తెల్లగా, మంచిగా కనిపిస్తాయి. కానీ వీటిలో పోషకాలు అసలే ఉండవు. దీన్ని తినడం వల్ల లేని పోని రోగాలొచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే శుద్ధిచేసిన వైట్ రైస్ ను, ఇతర ఆహారాలను ఎక్కువగా తినకండి.