మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా..? ఈ విషయాలు మీకోసమే.
ఎంత చేసినప్పటికీ కొన్ని చెడు అలవాట్లను మాత్రం నియంత్రించుకోలేం. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోళ్లు కొరుక్కోవడం. అవును.. దీనిని మీరు చాలా సార్లు గమనించే ఉంటారు. ఈ అలవాటు చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు అలవాటుగా ప్రారంభమయ్యే గోళ్లు కొరుక్కోవడం క్రమంగా వ్యసనంలా మారుతుంది. అయితే వైద్య పరిభాషలో దీన్ని ఒనికోఫాగియా అంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల్లో గోళ్లు కొరుక్కొనే అలవాటు ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా ఏ పనైనా చేసేటప్పుడు ఇంట్రెస్ట్ లేకపోతే చాలా మంది గోళ్లు కొరుకుంటారు. అయితే గోళ్లలో సార్మేనేలా, క్లేబ్సిల్లా అనే హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఒనికోఫాగియా ఉన్నవారిలో ఇది నోటి ద్వారా శరీరంలోకి వెళ్లి ఫుడ్ పాయిజన్‌కు కారణమతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోళ్లు కొరుక్కోవడం చాలా సాధారణమైన అలవాటు. అయితే కొంతమంది అదేపనిగా ఎప్పుడు చూసినా వేళ్లను నోటిలో పెట్టుకుని గోళ్లను కొరుక్కుంటారు. డిప్రెషన్, టూరెట్ సిండ్రోమ్ లేదా సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు అదే పనిగా గోళ్లు కొరుకుతారని వైద్యులు చెబుతున్నారు.
ఏదో ఒక పనిపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా మంది ఉద్దేశపూర్వకంగా గోళ్లు కొరుకుతారు. అయితే వారికి పని మీద సరైన ఏకాగ్రత లేకనే ఇలా చేస్తుంటారు. పాఠాలు వినే సమయంలో చాలా మంది విద్యార్థులకు ఇంట్రెస్ట్ లేక గోళ్లు కొరుక్కోవడం తరచూ చూస్తుంటాం. కొంతమంది ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు ఆసక్తి లేకపోయినా ఇలా చేస్తుంటారు. ఎలాంటి సందర్భాల్లో గోళ్లు కొరుకుతున్నారో గుర్తించండి. ఆ టైమ్‌లో ఇందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో ఆలోచించండి. స్ట్రెస్ బాల్ వాడుతూ ఈ అలవాటు నుంచి బయట పడవచ్చు.
మీకు నచ్చిన ఆటపై దృష్టి కేంద్రీకరించండి. ఎప్పటికప్పుడు గోళ్లను చిన్నగా కత్తిరించుకోండి. రోజుకు ఒకటి రెండుసార్లు గోళ్లు కొరుక్కొనే అలవాటు ఉంటే అదేమీ పెద్ద సమస్య కాదు. అయితే గోర్ల దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా గోరు ఇన్ఫెక్షన్, గోరు రంగు మారడం, గోర్లు వంకరగా మారినప్పుడు, గోళ్ల చుట్టూ రక్తస్రావం, చర్మం నుంచి గోరు వేరుకావడం, గోర్లు సన్నగా మారడం లేదా గట్టిపడటం, గోర్లలో వృద్ధి లేకపోయినప్పుడు, గోళ్ల చుట్టూ వాపు లేదా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా వైద్యుని సంప్రదించడం మంచిది.