డయాబెటిక్ పేషెంట్లు రక్తదానం చేయొచ్చా. చేస్తే ఏమవుతుంది.
ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మతగా దీనిని చెప్పవచ్చు. అతిమూత్రం, దాహం ఎక్కువగా వేయడం, చూపు మందగించటం, బరువు తగ్గడం, బద్ధకం ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. అయితే ప్రస్తుతం చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. జీవనశైలి, ఒత్తిడి కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి. ఒక్కసారి ఇది మన శరీరంలోకి ప్రవేశించిందంటే..
ఇక జీవితాంతం మనతోనే ఉంటుంది. అందుకే డయాబెటిస్‌ను నిరోధించలేం. పెరుగకుండా మాత్రమే చూసుకోవాలి. అయితే, కొందరు డయాబెటిక్ పేషెంట్స్ రక్తదానం చేసేందుకు వస్తే వారిని అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. దాంతో డయాబెటిస్ పేషెంట్లు రక్తదానం చేయవచ్చా? అనేది చాలా మందిలో తొలుస్తున్న అనుమానం. హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, డయాబెటిక్ పేషెంట్ కూడా రక్తదానం చేయవచ్చు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్న రోగులకు రక్తదానం చేయడం సాధారణంగా సురక్షితం.
అయితే ఇది పూర్తిగా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉన్నట్లయితే.. ఇతర సమస్యలు లేనట్లయితే.. కచ్చితంగా రక్తదానం చేయవచ్చు. అయితే, వైద్యుల సిఫార్సు అవసరం. రక్తదానం చేసే ముందు వీరు ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి. గుండె జబ్బులు లేదా ఇతర తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న మధుమేహులు రక్తదానం చేయకుండా ఉండటం శ్రేయస్కరం. మధుమేహులు రక్తదానం చేసిన తర్వాత ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందాలి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తదానం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తదానం చేయడానికి ముందు పుష్కలంగా నీరు త్రాగాలి. ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. లేనిపక్షంలో రక్తదానం చేయడానికి 1-2 వారాల ముందు ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలి. రక్తం దానం చేయడానికి ముందు రోజు 8 గంటల సుఖ నిద్ర పొందేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. రక్తదానం చేసే ముందు ఎప్పటికప్పుడు ఏదైనా తింటూ ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కనిష్టంగా కెఫిన్ తీసుకోవడం ఉత్తమం. ఇదే కాకుండా, డయాబెటిస్ మందులను దాటవేయకుండా చూసుకోవాలి.