మీరు జిమ్ కి వెళ్తున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.
వ్యాయామం అనేది శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ. వ్యాయామం ఎక్కువగా కండరాలను, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరచడానికి, క్రీడలలో మంచి ప్రావీణ్యత సాధించడానికి, అధిక బరువు తగ్గించుకోవడానికి, మానసిక ఉల్లాసం కొరకు చేస్తారు. అయితే దేహాన్ని బలిష్టంగా ఉంచుకోవడానికి జిమ్ లకు వెళ్లి గంటల తరబడి కసరత్తులు చేస్తుంటారు. సాధారణంగా బాడీబిల్డర్లే ఎక్కువగా ప్రోటీన్లు తీసుకుంటారు. శరీర ఆకృతిని తమకు నచ్చిన విధంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రోటీన్లను శిక్షణలో తీసుకుంటారు.
ఇప్పుడు బాడీ బిల్డర్లే కాదు.. చాలామంది శరీర ఆకృతి కోసమమని, మంచి ఫిట్ నెస్ కావాలంటూ ఎన్నో రకాల ప్రోటీన్లను తీసుకుంటున్నారు. స్పోర్స్స్ సప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఫిట్ నెస్ కోసం ప్రోటీన్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలకు భారీ గిరాకీ పెరుగుతోంది. ప్రోటీన్ షేక్స్, పౌడర్స్, బార్స్, పిల్స్ ఎన్నోకంపెనీల పేర్లతో మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. జిమ్ కు వెళ్లేవారిలో చాలామంది సగటున ఇలాంటి ప్రోటీన్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వాస్తవానికి.. ఫిట్ నెస్ కోసం ఇలాంటి ప్రోటీన్లు శరీరానికి అవసరమా? అనేదానిపై ఇటీవల ఓ అధ్యయనం కొన్ని అంశాలను వెల్లడించింది.
రెగ్యులర్ గా జిమ్ కు వెళ్లేవారిలో సగానికి పైగా ఈ ప్రొటీన్ సప్లిమెంట్స్ శిక్షణలో భాగంగా తీసుకుంటున్నట్టుగా అధ్యయనం తెలిపింది. ప్రోటీన్.. అనేది అవసరమైన పోషకం.. ఇది లేకుండా జీవించలేం. మన శరీరంలోని ప్రతి కణం.. ప్రోటీన్ తో కూడి ఉంటుంది. ఆయా ప్రోటీన్లతో శరీరంలోని కణజాలాలను నిర్మించుకోవడం, రిఫేర్ చేసుకోనేందుకు వినియోగిస్తుంటుంది. శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే ప్రోటీన్లతో హార్మోన్లు, ఎంజైమ్ లను ఉత్పత్తి చేసుకోవచ్చు. శరీరంలో ప్రోటీన్లను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం కూడా ఉంది.
ప్రత్యేకించి ప్రోటీన్లను శరీరానికి అందించాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఎవరికైనా ప్రోటీన్ల స్థాయి తగినంతగా లేనివారికే వైద్యుని సలహా మేరకు మోతాదుతో ప్రోటీన్లను రికమండ్ చేస్తుంటారు. జిమ్ చేశాక.. చాలామంది ఈ ప్రోటీన్లను తీసుకుంటుంటారు. కండరాలను పెంచుకోవడం కోసం కొంతమంది వాడితే, బరువు తగ్గేందుకు మరికొంతమంది వాడుతుంటారు. జిమ్ చేసే వారిలో చాలామంది తమ కండరాల (మజిల్) అభివృద్ధి, బలిష్టంగా కనిపించేలా చేసేందుకు అధిక మోతాదులో ఈ ప్రోటీన్లను తీసుకుంటుంటారు.